ఎవరి వాదన వారిది!
ఎవరి వాదన వారిది!
Published Tue, Oct 25 2016 8:52 PM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM
- రాష్ట్ర బీసీ కమిషన్‌కు పోటాపోటీగా కుల సంఘాల అభిప్రాయాలు
- పాములపాడులో స్వల్ప వాగ్వాదం
- కరివేనలో ప్రశాంతంగా ముగిసిన విచారణ
పాములపాడు: కాపు, బలిజలను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట కుల సంఘాలు పోటాపోటీగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం పాములపాడు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను జస్టీస్ మంజునాథ్, సభ్యులు ఎదుట వ్యక్తపరిచారు. అంతకు ముందు జస్టీస్ మంజునాథ్ మాట్లాడుతూ మండలంలోని కులాలు, జనాభా, వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతుల గురించి వివరించాలని కోరగా.. తహసీల్దార్ నాగేంద్రరావును వినిపించారు. అనంతరం బీసీ, ఎస్సీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే బీసీ జాబితాలో 140 కులాలున్నాయని, మరో 14 కులాలను చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన విచారణను తప్పుబట్టారు. అలాగే బలిజ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఏ మాత్రం పట్టించకోకుండా ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా బలిజలు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారని బీసీ సంఘం నాయకుడు సంజీవరాయుడు అనడంతో కొంత వాగ్వావాదం చోటు చేసుకుంది. జస్టీస్ మంఽజునాథ్ కల్పించుకొని ఒకరి గురించి ఇంకొకరు విమర్శించడం తగదని, ఎవరి వాదనలు వారు వినిపించుకోవాలని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. కుల సంఘాల నాయకులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. మంజునాథ్ కమిటీ సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ఆచార్య మల్లెలపూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, సభ్య కార్యదర్శి కృష్ణమోహన్, బీసీ వెల్ఫేర్ ఈడీ ఉశేన్‌సాహెబ్, ఆర్డీ రఘుబాబు, తహసీల్దార్ నాగేంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరనాయక్, సిబ్బంది, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement