బీసీల హక్కులను కాలరాస్తున్న కమిషన్
బీసీల హక్కులను కాలరాస్తున్న కమిషన్
Published Mon, Sep 19 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
– కమిషన్ చైర్మన్ మంజునాథ ఫోటోలు దహనం
కర్నూలు(అర్బన్): కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ బీసీల హక్కులను కాల రాస్తోందని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ ఆరోపించారు. సోమవారం సాయంత్రం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య కార్యాలయం ఎదుట మెయిన్‌రోడ్డుపై బీసీ జనసభ నేతలు కమిషన్ చైర్మన్ మంజునాథ ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ.. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న మంజునాథ, కాపులను బీసీ జాబితాలో చేరిస్తే బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పడం దారుణమన్నారు. బీసీ జాబితాలో ఉన్న 125 కులాలు నేటికి అసెంబ్లీ మెట్టు కూడా ఎక్కలేదని, 130 కులాలకు నేటి వరకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కులానికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరిలో ఐదుగురు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో ప్రజాభిప్రాయం పేరిట బీసీలను లాఠీలతో కొట్టించడం దురదష్టకరమన్నారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ విషయంపై ఎందుకు దష్టి సారించడం లేదన్నారు. త్వరలో రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ జిల్లా కన్వీనర్ వీ భరత్‌కుమార్, విద్యార్థి సమాఖ్య నాయకులు ముక్తార్‌బాషా, శివ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement