బీసీల హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలు
బీసీల హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలు
Published Sat, Dec 31 2016 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
– ప్రకాశం జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నూకపాని బాలాజీ
కర్నూలు(అర్బన్): పీడిత, అణగారిన, బీసీ వర్గాల హక్కుల సాధనకు దళిత బహుజనులంతా కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ద్వితీయ ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. మద్దిలేటియాదవ్ ఆధ్వర్యంలో బోయ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బాలాజి మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వినయ్ మాట్లాడుతూ బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వీరశేఖర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రానున్న ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సమాజ్‌వాది జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్ మాట్లాడుతూ పూలే ఆశయాల మేరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం, జిల్లాల అధ్యక్షులు శ్రీరాములు, రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి పోతన తదితరులు పాల్గొన్నారు.
Advertisement