
బాబు చెప్పలేదని.. నాతో ఎందుకు చెప్పిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అడగలేదన్న విషయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ చెప్పకనే చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడగలేదా అని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి, 'ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తారు.. మా సంకీర్ణ ప్రభుత్వం నేతగా చంద్రబాబు ఏం అడిగారో మీకు తెలుసు కదా? చట్టంలో ఉన్నదాన్ని అమలుచేయాలని చంద్రబాబు చెప్పారు'' అన్నారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని స్పష్టం చేశారు.
చట్టంలో ఉన్న అన్నింటినీ తాము అమలు చేస్తున్నామని, అసలు విభజన చట్టాన్ని తాము ఎక్కడ ఉల్లంఘిస్తున్నామో చెప్పాలని అన్నారు. ఇదే అంశాన్ని జయంత్ సిన్హా తన లేఖలో పేర్కొంటే.. ఆ లేఖను తప్పుడు కోణంలో ప్రచారం చేశారన్నారు. ఏపీని ప్రత్యేక తరగతి రాష్ట్రంగా కాకుండా.. ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని అనుకుంటున్నామని, ప్రత్యేక తరగతి హోదా అంశానికి ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని తెలిపారు. రైల్వేజోన్ గురించి తాము మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకుంటామని సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు.