డ్రోన్ కెమెరాల వినియోగం ఎందుకో..?
తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో రోజు రోజుకూ డ్రోన్ కెమెరాల హడావిడి పెరుగుతోంది. కార్లలో డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు, అక్కడికక్కడ ఆకాశంలో ఎగుర వేసి చక్కర్లు కొట్టిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట సిబ్బంది హడావిడి చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. రాజధాని గ్రామాల గత వైభవాలను చిత్రీకరిస్తున్నామని కొంతమంది, రాజధాని గ్రామాలను సర్వే చేస్తున్నామని మరి కొంతమంది, రాజధానిలో నిర్మించే భవనాలు, వంతెలను, లోతట్టు ప్రాంతాలను షూట్ చేస్తున్నామని మరి కొందరు చెబుతున్నారు. మరో పక్క డ్రోన్ కెమెరాలు విచ్చలవిడిగా వినియోగించరాదని ప్రభుత్వమే నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని పరిసర గ్రామాలలో జరుగుతున్న దానిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కెమెరాల వ్యవహారంపై సీఆర్‌డీఏ అధికారులు, స్థానిక అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని రాజధాని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.