ఎన్నారై భర్తపై భార్య ఫిర్యాదు
విశాఖ : ఆడపిల్ల పుట్టిందనే కోపం భార్యబిడ్డలను వదిలేసి ఓ భర్త అమెరికా వెళ్లిపోతే, మరో ఘటనలో అదనపు కట్నం కోసం ఓ ఎన్నారై భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో భర్త వేధింపులపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే ప్రతాప్రెడ్డి గార్డెన్కు చెందిన విజయానంద్తో జ్యోతిక వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం భర్తతో పాటు, అత్తమామలు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. పైపెచ్చు జ్యోతికకు అక్రమ సంబంధం అంటగట్టి వేధించడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.
యూకేలో టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్న భర్త విజయానంద్ గత రెండేళ్లుగా తనను, కొడుకును పట్టించుకోవడం లేదని బాధితురాలు జ్యోతిక ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అక్రమ సంబంధం ఉందంటూ విడాకులు కావాలంటూ భర్త నోటీసులు పంపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు జ్యోతిక తెలిపింది. అయితే న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.