హైదరాబాద్‌లో మరో ఎన్నారై మోసం
హైదరాబాద్: నగరంలో మరో ఎన్నారై మోసం వెలుగులోకి వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని.. రెండేళ్లు గడవక ముందే కట్టుకున్న భార్యను, ఆర్నెళ్ల బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో వదిలివెళ్లాడో ఎన్నారై. వివరాలు.. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన యాలాల శిరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయిరెడ్డి అనే ఎన్నారైకి వివాహం అయింది. పెళ్లి తర్వాత శిరీషను అమెరికా తీసుకెళ్లిన భర్త అక్కడ ఆమెను చిత్రహింసలు పెట్టాడు.
అంతేకాకుండా ఆరు నెలల బాబుకు తల్లి పాలు ఇవ్వకుండా అడ్డుకొని వేధింపులకు గురిచేశాడు. భర్త, అత్త కలిసి తల్లి నుంచి చిన్నారి వేరు చేసి చిత్రహింసలకు గురుచేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు నెలల బాబుతో పాటు శిరీషను వదలి వెళ్లాడు కీర్తిసాయిరెడ్డి. దీంతో ఆమె గురువారం తల్లిదండ్రుల సహాయంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. భర్తను తనను కలపాలని కోరుతోంది.