మైసూరు: వేరే మహిళతో కలిగిన తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, కుమార్తెపై భర్త తన ప్రియురాలితో కలిసి దాడి చేసి హత్య బెదిరింపులకు పాల్పడిన ఘటన నగరంలోని ఎన్‌ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాలు.. బెంగళూరుకు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త సంతోష్‌కుమార్, అతని ప్రియురాలు శిల్పలపై ఎన్‌ఆర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్వేత, సంతోష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు బెంగళూరులోని కెంగేరి లింగదీరనహళ్లి బడావణెలో నివసిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్య జీవితంలో సుడిగాలిలో శిల్ప ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఆరు నెలల క్రితం సంతోష్ కుమార్ జీవితంలోకి శిల్ప ప్రవేశంతో శ్వేత దాంపత్య జీవితంలో కుదుపు ఏర్పడింది.
తరచూ మొబైల్‌లో సంతోష్ కుమార్‌తో మాట్లాడుతూ అశ్లీల మెసేజ్‌లను పంపుతూ దగ్గరయిన శిల్ప క్రమంగా దంపతుల దాంపత్య జీవితానికి కంటకంగా మారారు. శిల్ప ప్రేరణతో సంతోష్ కుమార్ తరచు భార్య, పిల్లలపై దాడి జరిపి రగడ సృష్టించేవారు. ఈ విషయంపై గతంలో శ్వేత కెంగేరి పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం ఇద్దరు పిల్లలపై కూడా ప్రభావం చూపింది. చిన్న కుమార్తె మానసికంగా కుంగి మైసూరులో తల్లి ఇంటిలో ఉండిపోయింది.
కుమార్తెను చూసేందుకు శ్వేత తన పెద్ద కుమార్తెతో కలిసి మైసూరుకు వచ్చినప్పుడు బన్నిమంటప ఎల్‌ఐసీ సర్కిల్ వద్ద సంతోష్ కుమార్, అతని ప్రియురాలు శిల్ప ఎదురై శ్వేత, ఆమె కుమార్తెపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారు. దాడికి గురైన శ్వేత ఘటన నుంచి కోలుకున్న అనంతరం ఎన్‌ఆర్ పోలీసు స్టేషన్‌లో భర్త, ఆమె ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment