కర్ణాటక: ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేయించిన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని జన్నగట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి(50) హత్యకు గురైన వ్యక్తి. ఘటనకు సంబంధించి కోలారు రూరల్ పోలీసులు కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేశారు. తాలూకాలోని జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి ద్విచక్రవాహన రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే కృష్ణమూర్తి తలకు తగిలిన గాయాలపై పలు అనుమానాలు రేకెత్తాయి.
పోలీసు విచారణలో గుట్టురట్టు
అనంతరం పోలీసుల విచారణలో భార్య సౌమ్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. సౌమ్య తన మేనమామ కుమారుడు శ్రీధర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో భర్త జన్నఘట్ట కృష్ణమూర్తి, సౌమ్యల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దలు న్యాయ పంచాయతీ కూడా చేసినట్లు తెలిసింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతుండడంతో సౌమ్య భర్త కృష్ణమూర్తిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది.
పక్కా ప్రణాళికతో హత్య
ప్రియుడితో కలిసి ప్రణాళికను సిద్ధం చేసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనంలో వస్తున్న కృష్ణమూర్తిని డ్రాప్ అడిగే నెపంతో బైక్‌ను ఆపి సౌమ్య ప్రియుడు శ్రీధర్, అతని స్నేహితుడు శ్రీధర్ ఇనుప రాడ్‌తో దాడి చేసి తల వెనుక భాగాన గట్టిగా కొట్టడంతో కృష్ణమూర్తి రక్తగాయంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం భార్య సౌమ్య దీనిని ద్విచక్రవాహన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. రూరల్ పోలీసులు సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణమూర్తి, సౌమ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, వారు ప్రస్తుతం అనాథలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment