
'హోదా ప్రకటించే వరకూ పోరు'
విభజన హామీలు అమలుచేసేవరకు తమ పోరాటం ఆగదని కె.రామకృష్ణ స్పష్టం చేశారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి(గుంటూరు జిల్లా) : అక్రమ అరెస్టులతో ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపలేరని, రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు అమలుచేసేవరకు తమ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం బంద్ సందర్భంగా విజయవాడలో బైక్ ర్యాలీని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులను ప్రయోగించిందని మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరిగిందని చెబుతున్న చంద్రబాబు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు జరపడం దుర్మార్గమన్నారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేయడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని తన ఎంపీలతో కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.