
వైద్య వికటించి నాలుగు నెలల చిన్నారి..
వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
దేవరకొండ :
చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ దేవరకొండలోని ఓ ఆసుపత్రి ముందు ఆదివారం చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం... దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామపంచాయతీ పాత్లావత్‌తండాకు చెందిన పాత్లావత్ అనిత, రమేష్‌ల 4 నెలల బాబు శనివారం దేవరకొండలోని చిన్న పిల్లల వైద్యశాల అయిన సిలోయం ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిన్నారి జలుబుతో బాధపడుతున్నాడని చెప్పడంతో డాక్టర్ రవి టానిక్‌తోపాటు టాబ్లెట్లు ప్రిస్పిక్షన్‌గా ఇచ్చాడు. వైద్యం అనంతరం బాబును ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు బాబుకు డాక్టర్ సూచించిన టానిక్‌ను తాగించారు. కొద్దిసేపటికే ఫిట్స్ వచ్చి బాబు మృతి చెందాడు. దీంతో వైద్యం వికటించడం వల్లే బాలుడు మృతి చెందాడని భావించిన తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు చిన్నారి తల్లిదండ్రులకు, వైద్యుడికి మధ్య రూ.లక్ష బేరం కుదిరింది. ఈ విషయమై సిలోయం ఆసుపత్రి డాక్టర్ రవిని సాక్షి వివరణ కోరగా అనుకోకుండా ఫిట్స్ రావడం వల్లే బాబు మృతి చెందాడని ఇందులో తన నిర్లక్ష్యం ఏమీ లేదని వివరణ ఇచ్చాడు.