రూ.135 కోట్లతో రాష్ట్రంలో లింకు రోడ్లు
చింతలపూడి : రాష్ట్రంలో రూ.135 కోట్లతో లింకు రోడ్డు పనులు చేపడుతున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. చింతలపూడిలో నిర్మాణంలో ఉన్న రైతుబజార్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లింకురోడ్లకు ఖర్చు చేస్తున్న నిధుల్లో రూ.69 కోట్లు మార్కెటింగ్ శాఖకు చెందినవి కాగా, రూ.66 కోట్లు ఉపాధిహామీ నిధుల నుంచి ఖర్చుచేస్తున్నామన్నారు. ఫారం టు హోమ్ అనే కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాలకు రైతులు నేరుగా తమ పంటలను ఎగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో మార్కెట్ కమిటీకి లక్ష రూపాయల చొప్పున కేటాయించి, ఏడాదికి 5 చొప్పన పశువైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 రైతుబజార్లు ఉన్నాయని, మరో 20 రైతుబజార్లు 3 నెలల్లోగా పూర్తవుతాయని అదనంగా మరో 10 రైతు బజార్లను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. చింతలపూడి రైతు బజారు నిర్మాణం 10 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. ఆయన వెంట చిన్నంశెట్టి సీతారామయ్య, మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు ఉన్నారు.