వృద్ధురాలి దారుణహత్య
Published Thu, Jul 13 2017 12:15 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
ఆస్తి కోసం సొంత తమ్ముళ్ల ఘాతుకం!
కర్నూలు : కర్నూలు నగరం పాలకొట్టాలలో నివాసముంటున్న అంచల లక్ష్మమ్మ అలియాస్ సరోజమ్మ (70) దారుణహత్యకు గురైంది. పోలీసుల వివరాల మేరకు..సరోజమ్మ భర్త చిన్ననాగయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. సంతానం లేదు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఇల్లు, పొలం ఉంది. వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. తమ్ముడు శంకరయ్య పైఅంతస్తులో నివాసముండగా ఈమె గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటోంది. మరో సోదరుడు నారాయణ పక్క వీధిలో ఉంటున్నాడు. నందికొట్కూరు రోడ్డులో 50 సెంట్ల స్థలం ఉంది. భర్త బతికున్నప్పుడు తమకు రాసిచ్చాడని బావమరదులు శంకరయ్య, నారాయణ చెబుతుండగా, తమ భర్తను మోసం చేసి రూ.కోటి విలువ చేసే స్థలాన్ని కాజేశారని లక్ష్మమ్మ గతేడాది సొంత తమ్ముళ్లపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆస్తి అనాథ శరణాలయానికి రాసిస్తోందేమోనని..
తన ఆస్తిని అనాథ శరణాలయానికి రాసిస్తానని చెబుతుండటంతో అన్నదమ్ములు ఇద్దరూ కలసి లక్ష్మమ్మను ఇంట్లో గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నోటి నుంచి రక్తం కారడంతోపాటు తల వెనుక భాగంలో కూడా గాయం ఉంది. హత్య అనంతరం మృతదేహం చుట్టూ కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడవ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు నాగేంద్ర, శరత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రకాష్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరుగుపొరుగు వారిని విచారించారు. పోలీస్ జాగిలాన్ని రప్పించి ఆధారాలను సేకరించారు. మృతదేహం పడి ఉన్న స్థలం నుంచి పైఅంతస్తులో ఉన్న శంకరయ్య దగ్గర ఇంటికి వెళ్లి చుట్టూ తిరిగి కిందికి వచ్చింది. దీంతో హత్యలో అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున‍్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement