వివాహిత ఆత్మహత్య
కావలి అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక వైకుంఠపురం పెక్కుల ఫ్యాక్టరీ రోడ్డులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెంకుల ఫ్యాక్టరీ గిరిజనకాలనీ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద యనమల నరసింహం, అనూష (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను ప్రకాశం జిల్లా పెద్దపవనిలో జరుగుతున్న బంధువుల వివాహానికి నరసింహం తల్లిదండ్రులతో పంపించారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నరసింహం మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చి భార్యకు ఇచ్చి మళ్లీ బజారుకు వెళ్లాడు. ఇంతలో ఆమె ఇంటి తలుపునకు లోపల గడి పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లు కాలుతున్న సమయంలో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులందరూ తలుపు పగలగొట్టి తీసి చూడగా తీవ్రంగా కాలిపోయి అక్కడిక్కడే మృతి చెంది. ఈ విషయాన్ని స్థానికులు ఆమె భర్తకు తెలియజేయడంతో ఇంటికి చేరుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు, పిల్లలు ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.