రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
కావలిఅర్బన్ : కుటుంబ కలహాలతో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక ముసునూరు సమీపంలో రైలు పట్టాలపై గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. జలదంకికి చెందిన ప్రభాకర్, పి.శారద (35) దంపతులు కొంతకాలం నుంచి స్థానిక ముసునూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలు లేని కారణంగా ఓ బాలికను పెంచుకుంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పక్కనే ఉన్న రైలుపట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య, కావలి