కోరిక తీరిస్తేనే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళను వేధించిన వడ్డీ వ్యాపారిపై మంగళవారం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం..
విశాఖ నగరంలోని 3వ వార్డు, పాత డెయిరీఫారం ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ రెండు బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆ బంగారం విడిపించేందుకు లాసన్స్ బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిని కలిశారు. దీంతో రామకృష్ణ రూ.3 లక్షలు బ్యాంకులో కట్టి ఆమె బంగారాన్ని విడిపించాడు. అయితే ఆ బంగారంలో కొంత తన దగ్గరే ఉంచేసుకున్నాడు. దాన్ని ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బుకు నెలకు నూటికి రూ.12 చొప్పున వడ్డీ తీసుకుంటున్నాడు.
వడ్డీ బాగా పెరిగిపోయిందని వెంటనే చెల్లించాలని నాలుగు నెలలుగా ఆమెపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. తాను ఒకేసారి అంత సొమ్ము చెల్లించలేనని ఆమె చెప్పడంతో తన కోరిక తీరిస్తే గడువు పెంచుతానని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన శారద ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో రామకృష్ణపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 420, 509, 506, 384, 384ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించకపోయిప్పటికీ అతను పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.