
ఇంటి కోసం ఇల్లాలి హత్య
నిద్రలో ఉండగా బండరాయితో మోది చంపిన భర్త
హత్యానంతరం పోలీసుల ఎదుట లొంగుబాటు
ధర్మవరం అర్బన్: ఇంటిని తన పేరిట రాయలేదని ఇల్లాలని కడతేర్చిన భర్త ఉదంతమిది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నివాసం ఉంటున్న బలిజ ప్రసాద్, బలిజ వెంకటేశ్వరి (36) దంపతులు. బేల్దారి, గుజిరీ పనులు చేస్తూ జీవనం సాగించే ప్రసాద్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు భార్య పేరుమీద ఆమె పుట్టింటివాళ్లు రాసిచ్చారు. ఈ ఇంటిని తన పేరుమీద రాయాలని భార్యను వేధించేవాడు.
ఈ క్రమంలో వెంకటేశ్వరి శుక్రవారం పుట్టింట్లో వరలక్ష్మీవ్రతం చూసుకుని రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసింది. పూటుగా మద్యం తాగి వచ్చిన ప్రసాద్ మరోసారి ఇంటి విషయమై ఒత్తిడి తేగా.. ఆమె అంగీకరించలేదు. శనివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న వెంకటేశ్వరిని బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం భర్త ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హతురాలి తల్లిదండ్రులు, తమ్ముడి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ వెంకటరమణ, జమేదార్ మునేనాయక్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.