అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం చెరువుజమ్ములపాలెంలో చోటు చేసుకుంది..
* భర్తే హతమార్చారంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు
* పోలీసుల అదుపులో భర్త
బాపట్ల: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం చెరువుజమ్ములపాలెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెం గ్రామానికి చెందిన రావిపూడి నాగార్జున అనే యువకుడికి కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన జయసుధ (23)తో ఆరునెలల కిందట వివాహమైంది. పదిరోజుల కిందట కుటుంబంలో తలెత్తిన వివాదాలు కారణంగా తన కుమార్తెను అల్లుడు నాగార్జున కొట్టాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఫోన్ ద్వారా తెలియజేసిందని మండ్రు సుధాకర్ ఆలియాస్ డేవిడ్ తెలిపారు. అప్పుడు ఫోన్‌లో సమాచారం మేరకు జమ్ములపాలెం నుంచి స్వగ్రామమైన ఈపూరుపాలెం తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అల్లుడు శనివారం ఫోన్ చేసి తన భార్యను మంచిగా చూసుకుంటానని నమ్మబలికి తీసుకువెళ్ళాడని చెప్పాడు. ఆదివారం రాత్రి అత్త, భర్త ఇద్దరు కలిసి తన కుమార్తెను విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె ఫోన్‌లో సమాచారం తెలియజేసినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం భర్త నాగార్జునరెడ్డి తనకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుందని, పరిస్థితి విషమంగా ఉందని ఫోన్ పెట్టివేసిన్నాడని బోరున విలపించాడు. సోమవారం జమ్ములపాలెం వచ్చి చూసేసరికి వికటజీవిగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, భర్త కలిసి కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చూపుతున్నారని విలపించాడు. పోలీసులు నాగార్జునరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మహేష్, సీఐ శ్రీనివాసరావు తెలిపారు.