
అక్కడ ఆమెదే అరాచకం
విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కుంభకోణంతోపాటు ఎస్టీడీ వడ్డీ వ్యాపారుల బాధితుల్లో ఎక్కువమంది మహిళలే ఉండగా..
► టీడీపీ నేత స్నేహితురాలి ‘ఎస్‌టీడీ’ దందా
► అప్పు తీసుకుంటే అంతేసంగతులు
► సొమ్మంతా ఆ నాయకుడిదే
► అయినా పట్టించుకోని పోలీసులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కుంభకోణంతోపాటు ఎస్టీడీ వడ్డీ వ్యాపారుల బాధితుల్లో ఎక్కువమంది మహిళలే ఉండగా.. తాడేపల్లిగూడెంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ మహిళే కాల్‌మనీ, ఎస్టీడీ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకుడి స్నేహితురాలిగా అందరికీ సుపరిచితమైన ఆమె జోలికి వెళ్లాలంటే ఖాకీలకూ భయమే. రౌడీయిజమే నేపథ్యంగా రాజకీయాల్లో చెలామణీ అవుతున్న ఆ నాయకుడు ప్రస్తుతం పట్టణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు.
ఆ నాయకుడి దన్నుతోనే ఆ మహిళ ఇష్టారాజ్యంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. రూ.6 నుంచి రూ.10 వడ్డీతోపాటు తనఖా రిజిస్ట్రేషన్లు చేయించుకుని అప్పులు ఇవ్వడం ఆ మహిళ ప్రత్యేకత. వడ్డీ చెల్లించడం నాలుగైదు రోజులు ఆలస్యమైనా అంతే సంగతులు. ఇళ్ల మీద పడి గొడవలు చేయడం, ఎవరైనా ఒకింత ఎదురుతిరిగితే ఆ నాయకుడు రంగ ప్రవేశం చేసి నరకం చూపించడం షరామామూలుగా సాగిపోతుంటాయి. అప్పు తిరిగి చెల్లించే సందర్భంలో వాళ్లు ఎంత అంటే అంత ముట్టజెప్పాల్సిందే. ముందుగా అనుకున్న వడ్డీ రేటుతో సంబంధం లేదు.
అప్పు క్లోజ్ చేసేప్పుడు వడ్డీ రేటు ఎక్కువ చేస్తూ చుక్కలు చూపిస్తుంటారు. ఆమె బాధితుల్లో రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ కుమారుడితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కూడా ఉన్నారు. అయితే ఆమెకు అండగా ఉన్న ఆ నాయకుడు ప్రస్తుతం పవర్‌లో ఉండటం వల్ల ఎవరూ బయటకు వచ్చి చెప్పే సాహసం చేయడం లేదు. వాస్తవానికి ఆమె వడ్డీలకు తిప్పుతున్న డబ్బంతా ఆ నాయకుడిదేనన్న వాదనలూ ఉన్నాయి. ఎక్కడా ఫైనాన్స్ కంపెనీ పేరు లేకుండా ఓ బ్యూటీపార్లర్‌ను అడ్డాగా చేసుకుని ఆమె ఈ దందాకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం రాష్ట్రమంతటా జరుగుతున్న వడ్డీ వ్యాపారులపై దాడుల నేపథ్యంలోనూ ఆమె దందా వైపు కన్నెత్తి చూసే సాహసం పోలీసులు చేయడం లేదు.