- మహిళలపైకి మందుబాబులను ఉసిగొల్పిన వ్యాపారులు
- రక్షక భటులు రక్షణ వదిలి మందుబాబులకు మద్యం అందజేత
- ప్రత్యక్షంగా మద్యం వ్యాపారులకు సహకారం
- మరీ ఇంత బరితెగింపా అని మండిపాడు
- పరిసర ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు రావడంతో తోకముడిచిన వైనం
- మహిళల ఆగ్రహంతో ఎట్టకేలకు మద్యం దుకాణాలు మూత
మద్యంపై...పడతుల పోరాటం ... పోలీసుల వ్యాపారం
Published Tue, Jul 18 2017 11:14 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
కడియం :
మండల కేంద్రమైన కడియంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు మంగళవారం సాయంత్రం పోరాటానికి దిగారు. మంగళవారం మద్యం దుకాణాల వద్దకు పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమ్మకాలను అడ్డుకున్నారు. మూకుమ్మడిగా రావడంతో ఓ షాపు మూసివేయగా మరో షాపులో మాత్రం అమ్మకాలు యథావిధిగా కొనసాగించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ షాపు గేట్లు మూసివేశారు. దీంతో దుకాణంలోని సిబ్బంది మద్యం బాబులను మహిళలపైకి ఉసిగొల్పారు. రాయడానికి వీలులేని భాషలో ఉద్యమకారులను తిడుతూ ‘ వచ్చినవారిని అవతలికి తన్నేస్తే ఒకొక్కరికి క్వార్టర్ బాటిల్‌ను ఫ్రీగా ఇస్తానంటూ’ మందుబాబులకు షాపు యజమాని ఆఫర్ ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడున్న మందుబాబులు మహిళలపైకి రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలిసి కడియం పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం. సురేష్ అక్కడికి చేరుకుని మహిళలతో ఓ వైపు చర్చిస్తూనే మూసివేసిన షాపు గేట్లు తెరిచి అమ్మకాలకు అవకాశం ఇవ్వడంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమపై దాడికి ఉసిగొల్పిన వారితో చేతులు కలిపి మోసం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. షాపును తక్షణం ఇక్కడి నుంచి తొలగించే వరకూ ఊరుకునేది లేదని ఆందోళన చేపట్టారు. ఈ లోపు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున మహిళలు, యువకులు అక్కడికి చేరుకున్నారు. మహిళలను దుర్భాషలాడిన వ్యక్తిని తక్షణం ఇక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని మహిళలకు మద్దతుగా నిలిచారు. షాపు యజమాని అక్కడకు చేరుకుని అమ్మకాలు నిలిపివేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
Advertisement