సమ్మెను జయప్రదం చేయండి
కర్నూలు సిటీ: వచ్చే నెలలో కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణ్యికం పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక పొదుపు భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాణిక్యం, జిల్లా కార్యదర్శి మునెప్ప, ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్ నెహ్రూ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు వైవీ. రమణ ప్రసంగించారు. ఉద్యోగులు, కార్మికులు కొన్నేళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇస్తే కార్మిక హక్కులకు అవకాశం ఉండదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పోరాటాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. సమ్మెపై కార్మికులకు అవగహన కల్పించేందుకోసం ఈనెల25న జీపు జాతాలు, 27 నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో మెడికల్ రెప్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్షావలి, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.