టౌన్‌ప్లానింగ్ ఖాళీ
-
విధుల్లో చేరని నూతన అధికారులు
-
సాయంత్రం ఐదు గంటలకు మూత
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఖాళీ అయింది. మూడు రోజుల క్రితం ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీంతో కొత్తగా నియమితులైన ఇతర జిల్లాల అధికారులు మూడు రోజులు గడిచినా విధుల్లో చేరకపోవడం గమనార్హం. దీంతో టౌన్‌ప్లానింగ్‌లోని ఇతర అధికారులు, సిబ్బంది సాయంత్రం ఐదు గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ముఖ్యపాత్ర పోషించే టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో కొన్ని ఫైళ్లు నిలిచిపోయాయి. బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులివ్వడంలో ఆలస్యమవుతోంది. ఫలితంగా పలువురు యజమానులు బీపీఎస్ మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా ఆన్‌లైన్లో భవన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ఫైల్స్ కూడా నిలిచిపోయాయి. టీపీఓ సుధాకర్ తప్ప అధికారులెవరూ లేరు. నిత్యం సాయంత్రం 8 గంటల వరకు బిజీబిజీగా ఉండే టౌన్‌ప్లానింగ్ సాయంత్రం ఐదు గంటలకే మూతపడుతోంది.