‘సర్వేల్’ని నంబర్ వన్ ఇన్‌స్టిట్యూట్‌గా నిలబెడతా
‘సర్వేల్’ని నంబర్ వన్ ఇన్‌స్టిట్యూట్‌గా నిలబెడతా
Published Mon, Aug 1 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
సంస్థాన్ నారాయణపురం:
తెలంగాణ రాష్ట్రంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను నంబర్ వన్ ఇన్‌స్టిట్యూట్‌గా నిలబెడతానని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలను, కళాశాలను సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్‌సీసీ విద్యార్థులు పరేడ్‌తో పాఠశాలలోకి స్వాగతం పలికారు. గురుకుల పాఠశాలను కలియ తిరుగుతూ, తరగతి గదులకు వెళ్లి పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకుంటే అలా లేదు.. నేనెంతో ఊహించుకున్నానన్నారు. పాత ఫర్నీచర్, భవనాలను చూసి నేను గురుకుల పాఠశాల అంటే ఎంతో గొప్పగా ఉంటుందని ఊహించాను కానీ, ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ మొక్కలు నాటాలని, పాఠశాల విశాలంగా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. కేజీ టు పీజీ విద్యాపథకంలో భాగంగానే అంబేద్కర్ 125వ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 320 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక గురుకులం ఏర్పాటు ఖర్చు రూ.20కోట్లు చొప్పున రూ.6,400కోట్లు వెచ్చిస్తామని, 1.75లక్షల విద్యార్థులకు అవకాశం దక్కుతుందని, 10వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. గురుకుల పాఠశాల మెయింటనెన్స్, మౌలిక వసతుల కోసం రూ.118కోట్లు, వేతనాలకు, నిర్వహణకు రూ.135కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడానికి సర్వేల్ గురుకుల పాఠశాలను ఉన్నతంగా మార్చడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. సర్వేల్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలను తలదన్నే విధంగా మార్చుతామన్నారు. ఇప్పటికే రూ.1.5కోట్లు కేటాయించి, బిల్డింగ్ నిర్మిస్తున్నామని, ఆర్‌అండ్‌డీఎఫ్ కింద మరో రూ.5కోట్లు మంజూరు చేసి, టెండర్లు పిలుస్తామన్నారు. ఈ స్కూల్‌ను తీర్చిదిద్దడానికి రూ.10కోట్లు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు రిసెర్చ్ ట్రై నింగ్ సెంటర్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఉపముఖ్యమంత్రి
ఉపముఖ్యమంత్రి ఉపాధ్యాయుడి అవతారమెత్తి 8వ తరగతి పాఠాలు బోధించారు. తెలుగులోని సంధులు, చందస్సుపై విద్యార్థులకు ప్రశ్నలు సంధించారు. సవర్ణదీర్ఘసంధిఅంటే ఏమిటి, ఉపాధ్యాయులు బోధించారా, రాజేంద్రుడు సంధిని విడదీయండంటూ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాలేదు. మొదటగా విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి, ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు సరిగ్గా వస్తున్నారా, బూస్ట్ పాలు ఇస్తున్నారా, వారానికి ఎన్ని గుడ్లు అందజేస్తున్నారు, పండ్లు ఇస్తున్నారా, కూరలు ఎలా ఉన్నాయి.. అన్నం ఎలా పెడుతున్నారు, దొడ్డు బియ్యమా, సన్నబియ్యామా అంటూ విద్యార్థులను అడిగారు. కొంత మంది విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వచ్చే వారం నుంచి వారంలో ఒకసారి మటన్, చికెన్‌లలో ఏదో ఒకటి తప్పని సరిగా అందించాలని ఆదేశించారు.
సర్వేల్ గురుకుల కళాశాల తనిఖీ
గురుకుల కళాశాలను ఉపముఖ్యమంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కిచెన్‌రూమ్‌ను పరిశీలించారు. ఏం వంటలు వండారంటూ, గోకరకాయను, అన్నంను నోట్లో వేసుకొని రుచి చూశారు. పప్పుచారులో పప్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే బాగుండదని విద్యార్థులకు ఆహారం అందించడంలో కానీ, బోధనలో కానీ, ఎలాంటి తేడా చూపించినా, చర్యలు తీసుకుంటామని మరోసారి తనిఖీ చేస్తానని, ఎమ్మెల్యే ప్రతి నెలా పాఠశాలను, కళాశాలను తనిఖీ చేసి వారి సమస్యలను తెలుసుకుంటారన్నారు.
6 తరగతి గదులు మంజూరు
ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రికి తాను చదువుతున్న సర్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇదే అని చూపడంతో, పాఠశాలకు వెంటనే 6తరగతి గదులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ శేషుకుమారి, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, జెడ్పీటీసీ సభ్యులు బొల్ల శివశంకర్, పెద్దిటి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కత్తుల లక్ష్మయ్య, ప్రిన్సిపాళ్లు ఉపేందర్‌రెడ్డి, సీతారాం తదితరులున్నారు.
Advertisement