చినుకు.. చింత! | worry for rain | Sakshi
Sakshi News home page

చినుకు.. చింత!

Published Fri, Oct 28 2016 11:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

చినుకు.. చింత! - Sakshi

చినుకు.. చింత!

నెల రోజులుగా జాడలేని వరుణుడు
- ఎండుతున్న కంది, పత్తి పంటలు
- ఇప్పటికే 72వేల హెక్టార్లలో ఆశలు ఆవిరి
- రబీ శనగ సాగుకు కష్టకాలం
- ఇదే సమయంలో పతనమైన కంది, పత్తి ధరలు
- గగ్గోలు పెడుతున్న రైతాంగం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): అనావృష్టి.. అన్నదాత బతుకును ఛిద్రం చేస్తోంది. కీలకమైన అక్టోబర్‌ నెలలో వరుణుడి జాడ లేకపోవడం పంటలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు ఆగస్టులో ఏర్పడిన వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా చుక్క వర్షం లేని కారణంగా కంది, పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. ఎప్పుడూ లేని విధంగా డ్రై స్పెల్‌ 25 నుంచి 30 రోజులకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఇటీవలి వరకు పత్తి ధర ఆశాజనకంగా ఉన్నా.. రైతులు పండించిన పంట మార్కెట్‌లోకి రావడంతోనే ధర పతనమైంది. మరోవైపు కంది ధర పడిపోవడం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కంది సాగయింది. రికార్డు స్థాయిలో 96,438 హెక్టార్లలో సాగు చేశారు. ఒకప్పుడు అంతరపంటగా సాగు చేసే కంది ఇప్పుడు ప్రధాన పంటగా మారింది. పత్తి 1,66,972 హెక్టార్లలో సాగు చేశారు. అక్టోబర్‌ నెల మొదటి నుంచి చినుకు జాడలేకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కంది 28వేలు, పత్తి 32వేల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 72వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాల్వలకు నీళ్లు రాకపోవడం వల్ల వరి సైతం దెబ్బతింటోంది. జిల్లాలో  వరి 70,563 హెక్టార్లలో సాగు చేశారు. నీళ్లు రాకపోవడం వల్ల వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతింటున్నాయి. సెప్టెంబర్‌లో వర్షాలు మురిపించినప్పటికీ అక్టోబర్‌లో చినుకు జాడ లేకపోవడంతో ముఖ్యంగా కంది పంట దెబ్బతింటోంది. పత్తి పంటదీ ఇదే పరిస్థితి. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో ప్రస్తుతం కంది, పత్తి పంటలు మాత్రమే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే కనీసం ఒక వాన పడి ఉంటే ఈ రెండు పంటలు రైతులను ఆదుకునేవి.
 
నెల రోజులుగా వర్షాలు నిల్‌
నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు కోతకు వచ్చాయి. ఇప్పటికే చాల వరకు కోత పూర్తయింది. కంది, పత్తి దీర్ఘకాలిక పంటలు అయినందున ప్రస్తుతం వర్షాభావం వీటిపై ప్రభావం చూపుతోంది. గత ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. 86వేల ఎకరాలకు నీటి తడులు ఇచ్చినట్లు పేర్కొంటున్నా.. వాస్తవంగా ఒక్క ఎకరా పంట కూడా రెయిన్‌గన్‌లతో కోలుకున్న ధాఖలాలు లేవని అధికారులే చెబుతున్నారు. మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కంది, పత్తి, వరి పంటలు ఎండిపోతుండంతో జిల్లా యంత్రాంగం మరోసారి రెయిన్‌గన్‌లతో హడావుడి చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్‌ నెలలో సైతం కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లో వర్షాలు అంతంతమాత్రంగానే పడ్డాయి. ప్రస్తుతం నెల రోజులుగా వర్షాలు లేపోవడం.. పంటలు ఎండుతుండటంతో రెయిన్‌గన్‌తో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. అక్టోబర్‌ నెల సాధారణ వర్షపాతం 114. మిమీ ఉండగా.. నెల  రోజులు గడిచినప్పటికీ 9 మి.మీ., వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇందువల్ల ముఖ్యంగా కంది పంట కీలకమైన తరుణంలో బెట్టకు గురువుతోంది. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే పంటలు  పూర్తిగా ఎత్తిపోయో పరిస్థితి ఏర్పడింది.
 
ముందుకు సాగని శనగ సాగు
వర్షాభావ పరిస్థితుల వల్ల శనగ సాగు కష్టమవుతోంది. సెప్టెంబర్‌ చివరి వరకు వర్షాలు పడటంతో రబీలో శనగ సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. విత్తనాలను పోటీ పడి తీసుకున్నారు. తీరా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో శనగ సాగుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. నల్లరేగడి నేలల్లోనే శనగ వేస్తారు. ఈ భూముల్లో తేమ శాతం పడిపోవడంతో విత్తనం పనులు ముందుకు సాగడం లేదు. గత ఏడాది ఇదే సమయానికి  56,106 హెక్టార్లలో శనగ సాగయింది. వర్షాభావం వల్ల ఈసారి 26,863 హెక్టార్లకే పరిమితం అయింది. రబీలో మొలకెత్తిన వివిధ పంటలు ఎండుతున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నా వేలాది మంది రైతులు రబీ శనగపై ఆశలు పెట్టుకున్నారు. రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 42,884 హెక్టార్లలోనే సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 76,944 హెక్టార్లలో రబీ పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లోని కంది, పత్తి, వరి  దెబ్బతింటుండటం, రబీ పంటల సాగుకు నేలలో పదును లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement