తాడిపత్రిలో రాక్షస పాలన
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి నియోజకవర్గంలో రాక్షసపాలన సాగుతోందని, ప్రజలను రక్షించేందుకే బీజేపీలో చేరామని మండలంలోని చిన్నపోలమడ గ్రామంలో ఉన్న ప్రభోదనందస్వామి ఆశ్రమ నిర్వాహకులు యోగానందచౌదరీ పేర్కొన్నారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు రౌడీలమని చెప్పుకుంటూ నియంత పాలన చేస్తున్నారని ఆరోపించారు. యోగానందచౌదరీ సోదరుడు జితేంద్రచౌదరి మాట్లాడుతూ స్థానిక రాజకీయ నాయకులకు దేవుడన్న, ప్రజలన్న గౌరవం లేదన్నారు. అందుకే కృష్ణామందిరం ఆశ్రమంలో చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో..
ప్రభోదనంద ఆశ్రమ నిర్వాహకులు యోగానందచౌదరి, జితేంద్రచౌదరీతో పాటు 3వేల మంది ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి, రాష్ట్ర సంఘటిత ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి రామకృష్ణారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అ«ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు హరిష్‌కుమార్‌రెడ్డిలతో కలిసి యోగనందచౌదరీ, జితేంద్రచౌదరిలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే 3 వేల మందితో సెల్‌ఫోన్ ద్వారా సభ్యత్వం నమోదు చేయించి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సామాన్యుల అలోచన దిశగా పరిపాలన చేస్తున్న నరేంద్రమోదీ పాలన చూసి ప్రభోదనంద ఆశ్రమ నిర్వాహకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం అభినందనీయన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో బీజేపీ బలపడటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, రంగనాథరెడ్డి, రాంబాబు, ఆంజనేయలు, చంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు.