కరువు తాండవిస్తున్నా పట్టించుకోరా? | Ys jagan fires on government | Sakshi
Sakshi News home page

కరువు తాండవిస్తున్నా పట్టించుకోరా?

Published Tue, May 3 2016 12:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కరువు తాండవిస్తున్నా పట్టించుకోరా? - Sakshi

కరువు తాండవిస్తున్నా పట్టించుకోరా?

మాచర్ల మహాధర్నాలో సర్కారుపై జగన్ మండిపాటు
 
♦ తాగడానికి నీళ్లు లేక ప్రజల గొంతెండుతోంది
♦ సాగునీటి సౌకర్యంలేక ఎండిపోతున్న పంటలు
♦ పశుగ్రాసం లేక చనిపోతున్న పశువులు
♦ పంటల్లేక రైతులు, పనుల్లేక రైతు కూలీలూ వలస పోతున్నారు
♦ అండగా నిలవాలన్న ఆలోచన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి లేదు
♦ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు
♦ ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు
♦ ఉపాధి కూలీల పొట్టకొట్టి సిమెంట్ రోడ్లు, నీరు-చెట్టు పనులు చేశారు
♦ వైఎస్సార్ హయాంలో 97.5 శాతం నిధులు కూలీలకే కేటాయించారు
♦ కేసీఆర్ ఎత్తిపోతల పథకాలతో నీళ్లు తీసుకెళ్తున్నా చంద్రబాబు నోరెత్తడంలేదు
♦ అడిగితే ఓటుకు-నోటు కేసు బయటపెడతారని రైతులకు అన్యాయం చేస్తున్నారు
♦ జనం గొంతు వినిపించకుండా సంతలో గొర్రెల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు
♦ చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోట్లు, పాలనంతా మోసం
♦ ఈ దుష్టపాలన అంతం చేసేందుకు ఉద్యమిద్దాం.. అందుకు ఇదే ఆరంభం
 
 (మాచర్ల నుంచి సాక్షి ప్రతినిధి)

 ‘‘రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. తాగడానికి మంచినీళ్లు లేవు. పంటలు ఎండిపోతున్నాయ్. నీళ్లు లేక, పశుగ్రాసం లేక పశువులు చనిపోతున్నాయి. అయినా ప్రభుత్వం తరపున పట్టించుకునే దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో రైతులు, ప్రజలకు అండగా ఉండాలన్న ఆలోచన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరువు పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం మాచర్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జగన్ వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం యథాతథంగా...

 ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు..
 ఎన్నికలప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ... వరుసగా మూడు దఫాలుగా తుఫాను వచ్చింది, కరువొచ్చింది, ప్రజలను ఆదుకుంటామన్నారు. సీఎం అయిన వెంటనే రైతులకు పంగనామాలు పెట్టటం మొదలుపెట్టారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వమని రైతులు అడిగితే రూ.1642 కోట్లు పంగనామాలు పెట్టారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి మొదట రూ.1500 కోట్లు కరువు వల్ల నష్టం వచ్చిందన్నారు. కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి నష్టాన్ని తగ్గించి, రూ.వెయ్యి కోట్లకు చేర్చారు. మళ్లీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రూ.292 కోట్లకు తగ్గించారు. దాన్నైనా ఇచ్చారా అంటే అదీ లేదు. రూ.100 కోట్లు బకాయిలు పెట్టారు. 2015-16 సంవత్సరంలో కరువు, అకాల వర్షాలు వచ్చాయి. ఆ సమయంలో రూ.వెయ్యి కోట్లు నష్టం వాటిల్లిందని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు.

 వలసలు పోతున్నా పట్టించుకోవడంలేదు
 కరువు పరిస్థితుల్లో ఎండాకాలం నీళ్లుండవని అందరికీ తెలుసు. నీటి కొరత తీర్చేందుకు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కలెక్టర్లతో రివ్యూలు ఏర్పాటు చేయాలి. బోర్లు, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌ల ద్వారా నీళ్లు అందుతున్నాయా లేదా తెలుసుకోవాలి. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఎమ్మెల్యేలను పంపించి నీళ్లు ఇప్పించే పనిచేయాలి. వలస నివారణకు ఉపాధి పనులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. పంటలు ఎండిపోయి రైతులు, పనుల్లేక రైతు కూలీలు వలస బాటపట్టారు. ఉపాధి పనులకు రూ.4,500 కోట్ల నిధులు కేటాయిస్తే... అందులో వెయ్యి కోట్లు సిమెంట్ రోడ్లకు, మరో రూ.2,500 కోట్లు నీరు-చెట్టు పనులకు ఉపయోగించారు. సిమెంట్ రోడ్లు, నీరు-చెట్టు పనులు చేయొద్దని చెప్పడంలేదు. ఉపాధి కూలీల కోసం కేటాయించిన నిధులను మళ్లించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు 60 శాతం వారికే కేటాయించాలి. వైఎస్సార్ హయాంలో ఉపాధి కూలీల కోసం 97.5 శాతం నిధులు కేటాయించారు. కరువు తాండవిస్తోంది. పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండటం మరచి, ఉపాధి కూలీలకు ఇచ్చే సొమ్ములు ఎలా కత్తిరించాలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఓటుకు నోటు కేసు భయంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
 కనుచూపు మేరలో నాగార్జునసాగర్ కనిపిస్తున్నా నీళ్లు దొరకని పరిస్థితి. కర్ణాటక, మహారాష్ర్ట నుంచి వచ్చే కృష్ణానది నీళ్లు మహబూబ్‌నగర్ ద్వారా శ్రీశైలంకు రావాలి. శ్రీశైలం నిండితేగానీ సాగర్‌కు నీళ్లు రావు. అక్కడినుంచి నాగార్జునసాగర్‌కు రావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం నిండుగా ఉంటేనే రాయలసీమ, కృష్ణా, డెల్టా సస్యశ్యామలం అవుతాయి. వీటికి దెబ్బకొట్టేలా తెలంగాణ సీఎం కేసీఆర్ 115 టీఎంసీల నీటిని పాలమూరు, దిండి ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు నోరెత్తడంలేదు. రైతులకు నీళ్లు ఎలా ఇవ్వాలో ఆలోచించడంలేదు. తాను మాట్లాడితే.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న వీడియో, ఆడియో టేపులు బయటపెట్టి జైలుకు పంపుతారని భయపడి చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తున్నారు.

 దుష్టపాలనపై పోరాటాలకిదే ఆరంభం
 మాచర్ల ప్రజలకు మేలు చేయాలని వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వటానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.100 కోట్లు కేటాయిస్తే 2015 జూలై 30న చంద్రబాబు రద్దు చేశారు. రూ.100 కోట్లతో అనుపు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ సంకల్పించారు. దీనికి సంబంధించిన 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం ఐదుశాతం నిధులు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనిచేయకుండా మాచర్ల ప్రజలను ఇబ్బందులు పాలుచేస్తోంది. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నా నోరు మెదపడంలేదు. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి జాడే లేదు.

అందరికీ ఇళ్లు ప్రస్తావనే చేయడంలేదు. కరువును కూడా లాభంగా మార్చుకునేందుకు, 13జిల్లాల్లో మజ్జిగ సరఫరా పేరిట తన హెరిటేజ్ కంపెనీ ద్వారా రూ. 39 కోట్ల కైంకర్యం చేసేందుకు పథకం రచించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోట్లు, పాలనంతా మోసం. రైతులు, పేదల గొంతు వినిపించకుండా చేసేందుకు విపక్ష ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కోట్ల రూపాయలు వెదజల్లి కొంటున్నారు. అధికార, ధన దాహాన్ని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల దాహాన్ని తీర్చుకుంటున్న దుర్మార్గపు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెల గాటమాడుతోంది. ఈ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేసేందుకు అందరం కలిసి ఉద్యమిద్దాం. అప్పటికీ ప్రభుత్వం పద్ధతులను మార్చుకోకపోతే మరిన్ని ఆందోళనలు చేపట్టి కళ్లు తెరిపిద్దాం. అందుకు ఇదే ఆరంభం. అని జగన్ అన్నారు.
 
  తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన జగన్
 మండుటేసవిలో 45 డిగ్రీల ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాచర్లలో మహాధర్నా నిర్వహించారు. ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ రిజర్వాయర్‌ను పరిశీలించి మధ్యాహ్నం 12.30 గంటలకు మాచర్లకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి వేలాదిమందితో ఒంటిగంటకు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తగినంత సురక్షితమైన తాగునీటిని, గృహ అవసరాల నీటి సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతూ తహసీల్దార్ ఫణీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ ముస్తఫా, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతునాయక్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, ఎంపీపీ ప్రత్యేక ఆహ్వానితుడు ఓరుగంటి జయపాల్‌రెడ్డి, పులగూర శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వై.రోశిరెడ్డి, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement