
మాచర్ల ధర్నాలో పాల్గొన్న వైఎస్ జగన్
గుంటూరు : రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న సర్కార్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం గుంటూరు జిల్లా మాచర్ల తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన వాహనంపై నుంచి ఖాళీ బిందెతో నిరసన తెలియచేస్తూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
మరోవైపు వైఎస్ జగన్ పాల్గొనే ధర్నా కార్యక్రమానికి గుంటూరు జిల్లాతో పాటు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు భారీగా తరలి వచ్చారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయనకు నాగార్జున సాగర్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.