చంద్రబాబును క్షమించకూడదు: వైఎస్ జగన్ | ys jagan mohan reddy takes on chandrababu niadu over drought | Sakshi
Sakshi News home page

చంద్రబాబును క్షమించకూడదు: వైఎస్ జగన్

Published Mon, May 2 2016 1:05 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

చంద్రబాబును క్షమించకూడదు: వైఎస్ జగన్ - Sakshi

చంద్రబాబును క్షమించకూడదు: వైఎస్ జగన్

గుంటూరు : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు...రైతులకు పంగనామాలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

'రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. తాగడానికి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గతేడాదికి సంబంధించి ఇన్ఫుట్ సబ్సిడీలో రూ.వెయ్యికోట్లలో ఒక్క రూపాయిని ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఎన్నికలయ్యాకు 2013-14 ఇన్ఫుట్ సబ్సిడీ రూ.1602 కోట్లు పంగనామాలు పెట్టారు. 2015-16కు సంబంధించి వెయ్యికోట్లలో ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. కరువుపై మార్చికల్లా కార్యాచరణ రూపొందించాల్సి  ఉన్నా..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పంటలు పండక రైతులు, కూలి దొరక్క కూలీలు వలసలు పోతున్నారు. ఉపాధి కూలీల కోసం కేంద్రం రూ.4500 కోట్లు కేటాయిస్తే సిమెంట్ రోడ్లకు వెయ్యి కోట్లు, నీరు-చెట్టుకు రూ.2500 కోట్లు మళ్లించారు. ఉపాధి నిధులను మళ్లించడం ఎంతవరకు న్యాయం. ఉపాధిహామీ పథకాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారు. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా మాచర్లలో నీళ్ల దొరకని పరిస్థితి. శ్రీశైలంలో నీళ్లులేవు, అక్కడ నిండితే కానీ, సాగర్కు నీళ్లు రావు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కృష్ణానది నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి శ్రీశైలానికి వస్తేనే రాయలసీమ జిల్లాలకు నీళ్లు వస్తాయి.

పాలమూరు ఎత్తిపోతలకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మాచర్లలో తాగడానికి నీళ్లులేవు, రెండ్రోజులకోసారి నీళ్లిస్తున్నారు. మాచర్లకు నీళ్లివ్వడానికి 200౮లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 17 కోట్లు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు. జర్రివాగు వాటర్ స్కీం పరిస్థితి అంతే.

ఓ వైపు చుక్క నీటి కోసం రైతులను అష్టకష్టాలు పడుతుంటే మరోవైపు రూ.20కోట్లు ఇచ్చి సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబును క్షమించకూడదు. ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ సీపీ ఉద్యమం ఆగదు. భవిష్యత్ లో కూడా పోరాడతాం. అందుకు మీ అందరి సహకారం అవసరం.' అని  వైఎస్ జగన్ పేర్కొన్నారు. ధర్నా అనంతరం వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement