సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్ | ys jagan mohan reddy console satyavathi in west godavari | Sakshi
Sakshi News home page

ప్రజల ఉసురు పోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా?

Published Wed, Oct 19 2016 1:59 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్ - Sakshi

సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్

తణుకు: ప్రజాభిప్రాయం సేకరించకుండా గ్రామాల మధ్య ఫ్యాకర్టీ నిర్మించడం దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పెట్టవద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించటం సరికాదని ఆయన అన్నారు. ఆక్వా బాధితులను చూస్తుంటే  కడుపు తరుక్కుపోతోందన్నారు.  ఆక్వాఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో ఉన్న సత్యవతిని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవతి చేసిన తప్పంటేని, కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన వారిపై హత్యాయత్నం కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే ఏడుగురిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గ్రామస్తులు వద్దని చెప్పినా గ్రామం మధ్యలో ఫ్యాక్టరీ పెట్టడం మొదటి తప్పని, అమాయాకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఇంకో తప్పని, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం నాలుగో తప్పని అన్నారు.

ఇంతమంది ఉసురు పోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందని జనం చెబుతున్నా పట్టించుకోరా అని సూటిగా అడిగారు. ఇప్పటికే డెల్టా పేపర్ మిల్లుతో ప్రజలు ఇబ్బందులు పాలువుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆక్వా ఫ్యాక్టరీ పెడితే అదే పరిస్థితి వస్తుందని స్థానికులు బాధపడుతున్నారన్నారు. ప్రజల బాధ ప్రభుత్వానికి పట్టదా అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనకు కావాల్సిన వారికి మేలు చేసేందుకు ఎంతకైనా తెగిస్తోందన్నారు. పది కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టుకోండని జనం చెబుతున్నా పట్టించుకోవటం లేదన్నారు.

చంద్రబాబు ఓ వైపు ఈ ఫ్యాకర్టీతో కాలుష్యం ఉండదంటున్నారని, మరోవైపు పైప్లైన్ నిర్మిస్తామని చెబుతున్నారని, పైప్లైన్ వేయటానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒకవేళ పైప్లైన్ లీకేజీ అయితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే సముద్ర తీరప్రాంతానికి ఫ్యాక్టరీని తరలించి ప్రజలకు మేలు చేయాలని అన్నారు. సముద్ర తీరప్రాంతంలో మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి  350 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి అక్కడే ఫ్యాక్టరీ పెడితే తాము కూడా సహకరిస్తామన్నారు. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుందని, ప్రజల ఉసురుతో ప్రాజెక్టులు నిర్మించలనుకోవటం సరికాదన్నారు.

కాగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో సత్యవతి ఒకరు. ఆమె ప్రస్తుతం తణుకు సబ్‌జైల్లో ఉన్నారు. ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టిందనే ఆరోపణతో సత్యవతిపై కేసు బనాయించి.. జైలుకు పంపారు. ఆమె కుమారుడితోపాటు మరో ఆరుగురు నర్సాపురం సబ్‌జైల్లో ఉన్నారు. 36 రోజులుగా సత్యవతి జైలు జీవితం గడుపుతున్నారు. పోలీసులు సత్యవతిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement