కొవ్వూరులో వైఎస్ జగన్ పుష్కరస్నానం
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన బుధవారం ఉదయం రాజమండ్రి నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు చేరుకుని, అక్కడి గోష్పాదక్షేత్రానికి విచ్చేశారు.
గోష్పాదక్షేత్రంలో గోదావరి మాతకు ఆయన పూజలు చేశారు. పుష్కర ఘాట్ వద్ద తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి వైఎస్ జగన్ పిండ ప్రదానం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ప్రార్థించారు.
వైఎస్ జగన్ తిరిగి రాజమండ్రి చేరుకుని అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉమామార్కేండేయేశ్వరస్వామివారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పుష్కర సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం కోటిలింగాల ఘాట్‌ను సందర్శించి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరతారు.