గన్నవరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకుంటారు.
కాగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బందర్ రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలతో సహా పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారపక్షం వైఫల్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాలతో పాటుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరుపై చర్చ జరుగుతుంది.