ఉండవల్లికి వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా ఉండవల్లి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కొద్ది రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి మరణించారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వైఎస్ జగన్ ఫోన్ చేసి ఉండవల్లిని పరామర్శించారు. వైఎస్ జగన్కు ఉండవల్లి సాదర స్వాగతం పలికారు. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి కుటుంబ సభ్యులను పేరుపేరునా ఆయన పలకరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల మరణించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. జిల్లాలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. రేపు ఉదయం జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కుక్కునూరులో పోలవరం నిర్వాసితులకు సంఘీభావం తెలుపనున్నారు. వైఎస్ జగన్ వెంట ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్లనాని, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, గంటా మురళి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు.