నాకు రాజకీయ భవిష్యత్ లేదు
నాకు రాజకీయ భవిష్యత్ లేదు
Published Fri, Jan 3 2014 4:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాజమండ్రి : ‘నేను ఎన్నికల్లో పోటీ చేయను. పోటీ చేసినా గెలవను. ఏ పార్టీలోనూ చేరను. స్వంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన నాకు రాజకీయ భవిష్యత్తు లేదు’- కాంగ్రెస్ తరఫున రాజమండ్రి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఉండవల్లి అరుణ్‌కుమార్ మాటలివి. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరును బట్టి ఆయన రాజకీయ వైరాగ్యానికి లోనైనట్టు అనిపిస్తోంది.
అయితే.. ఉండవల్లి ప్రకటించిన వైరాగ్యం వాస్తవమైనదేనా లేక వ్యూహాత్మకమా అన్న అనుమానాలను పక్కన పెడితే.. వాస్తవానికి..రాష్ట్ర విభజన నిర్ణయంతో నెలకొన్న పరిణామాలు సీమాంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నేతలందరి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి. పలువురు నేతలు పార్టీలో కొనసాగి తిరిగి పోటీచేసినా డిపాజిట్ కూడా దక్కదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. పార్టీలో ఉండి ఉన్న కాస్త పరువూ పోగొట్టుకునే కంటే ముందుగా తప్పుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు.
జిల్లాలో దాదాపు కాంగ్రెస్ నేతలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కొందరు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని ఎంతగా బెంబేలెత్తుతున్నా.. మిగిలిన నాయకులు ఆ మాటను బాహాటంగా అనడానికి జంకుతుండగా.. ‘పిల్లి మెడలో గంట కట్టిన ట్టు’.. వారి మనసులోని మాటను ఉండవల్లి పరోక్షంగా వ్యక్తం చేసినట్టయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఉండవల్లి వైరాగ్యం రూపాయికి నూరుపైసలన్నంత నికరమైనదే అయినా.. ‘నాకు రాజకీయ భవిష్యత్తు లేదు’ అన్న ఆయన మాటలు అక్షరాలా కాంగ్రెస్‌కే ర్తిస్తాయంటున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నెలకొన్న రాజకీయ పరిణామాలకు విభజన నిర్ణయం కూడా తోడవడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలి పోతున్నాయనేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదంటున్నారు.
కిరణ్ పెట్టబోయే పార్టీకి సిద్ధాంతకర్తగా ఉంటారా..?
కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి నమ్మినబంటుగా పేరొందిన ఉండవల్లి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. ఇకపై ఎన్నికల బరిలో నిలిచేది లేదని, మిగిలిన జీవితంలో కలం, కాగితంతో కాలక్షేపం చేస్తానని, ప్రజల తరఫున న్యాయపోరాటం (ఉండవల్లి న్యాయశాస్త్ర పట్టభద్రుడు) సాగిస్తానని ప్రకటించడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందనే వారు కూడా లేకపోలేదు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ సీనియర్లు మాత్రం ఉండవల్లి తొందరపడి నిర్ణయం తీసుకోరనే అభిప్రాయానికి వస్తున్నారు.
ఉండవల్లి మాటలను కొందరు మరింత లోతుగా విశ్లేషిస్తూ మరోసారి పోటీ చేసినా గెలవడం కష్టమనడాన్ని బట్టి ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెడతారని భావిస్తున్న కొత్త పార్టీలో చేరబోరని అంటున్నారు. అయితే నేరుగా పోటీ చేయకున్నా కిరణ్ పార్టీ వెనుక ఉండి సిద్ధాంతకర్తగా వ్యవహరించే ఆలోచన ఉండి ఉంటుందని కొందరు అంటున్నారు. విలేకరులు ‘సీఎం పెట్టబోయే కొత్తపార్టీలో చేరతారా?’ అని అడిగితే ‘సీఎం పార్టీ పెడుతున్నట్టు నాకు చెప్పలేదు, అయినా నేను ఆ పార్టీలోనే కాదు ఇక ఏ పార్టీలోనూ చేరను’ అని అంటూనే ఉండవల్లి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని పొగడ్తలతో ఆకాశానికెత్తేయడం గమనార్హం అంటున్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చే అధికారం సీఎంకు ఉంటుందంటూనే తనకు తెలిసి ‘కిరణ్ నిజాయితీ పరుడు, అబద్ధాలు ఆడడు’ అంటూ కితాబిచ్చారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఉండవల్లి రాజకీయ వైరాగ్య ప్రకటన వెనుక ఇంకేదో బలమైన వ్యూహం లేకుండా పోదనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. ఏది ఏమైనా ఉండవల్లి నిర్ణయం కాంగ్రెస్‌లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
20న కార్యకర్తలతో హర్షకుమార్ సమావేశం!
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో కొత్తపార్టీ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో.. ఇంత వరకూ తెలుగుదేశంలోకి వెళ్లే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పునరాలోచనలో పడ్డారని సమాచారం. కాగా అమలాపురం ఎంపీ హర్షకుమార్ తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించేందుకు ఈ నెల 20న రావులపాలెంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement