వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
మహబూబాబాద్లో కర్రెయ్య కుటుంబాన్ని, తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు.