వైఎస్సార్ సీపీ నేతను కోర్టులో హాజరుపర్చాలి | YSR CP leader produced in court | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నేతను కోర్టులో హాజరుపర్చాలి

Published Fri, Jun 10 2016 12:33 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్ సీపీ నేతను కోర్టులో హాజరుపర్చాలి - Sakshi

వైఎస్సార్ సీపీ నేతను కోర్టులో హాజరుపర్చాలి

దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ నాయకుల ధర్నా
►  నిరవధిక ఆందోళన .. పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు
►  పోలీసుల అదుపులో ఉన్న గురవాచారికి నేతల పరామర్శ

 
 
దాచేపల్లి : పోలీసుల అదుపులో ఉన్న పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురవాచారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు దాచేపల్లి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఏకధాటిగా ధర్నా చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. గురవాచారిని కోర్టులో హాజరుపరిచేంత వరకు కదిలేది లేదని భీష్మించారు.

దీంతో ధర్నా చేస్తున్న నాయకుల వద్దకు గురువారం ఉదయం గురజాల సీఐ ఆళహరి శ్రీనివాసరావు, ఎస్సై కట్టా ఆనంద్ వచ్చి ఆందోళనను విరమించాలని కోరారు. గురవాచారిని కోర్టుకు తరలించేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని జంగా తేల్చి చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఆందోళన విరమించాలని సీఐ సర్ధి చెప్పారు.

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని జంగా మండిపడ్డారు. స్టేషన్లు తిప్పుతూ గురవాచారిని చిత్రహింసలు పెట్ట్టే పరిస్థితి కనిపించటం వలనే తాము ఇక్కడే కుర్చుంటామన్నారు. తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.


 టీడీపీ ఎమ్మెల్యే మెప్పు కోసం...
తొలుత పోలీసుల అదుపులో ఉన్న గురవాచారిని నాయకులు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న సీఐ శ్రీనివాసరావును కలిసి నాయకులు మాట్లాడారు. గురవాచారిని అన్యాయంగా ఎందుకు స్టేషన్‌లో ఉంచారని రాజశేఖర్ ప్రశ్నించారు. నారాయణపురానికి చెందిన సయ్యద్ రెహ్మాన్ అనే వ్యాపారి సంతకాన్ని ఫోర్టరీ చేశారనే ఫిర్యాదు మేరకు గురవాచారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ చెప్పారు. చట్టపరంగానే వ్యవహరిస్తున్నామన్నారు. దీంతో రాజశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో పిల్ వేసి, లోకాయుక్తకు గురవాచారి ఫిర్యాదు చేయటం వల్లే కక్ష పెంచుకున్నారని, ఎమ్మెల్యే మెప్పు పొందటానికే గురవాచారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, సయ్యద్ రెహ్మాన్ కూడా అతని క్వారీలో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని లోకాయుక్త డెరైక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, మరి అందులో వాస్తవాలు తెలుసుకునేందుకు పిటిషనర్‌ను పిలిచి ఎందుకు విచారించలేదని నిలదీశారు.

అధికార పార్టీ నాయకుల సేవలో పోలీసులు తరించిపోతున్నారన్నారు. గురవాచారిని తక్షణమే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని సీఐతో రాజశేఖర్ తేల్చి చెప్పారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.


144 సెక్షన్ విధింపు..
నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు స్టేషన్ ఎదుట 144 సెక్షన్ ను విధించారు. తర్వాత నాయకుల వద్దకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అయినా నాయకులు, కార్యకర్తలు వినలేదు. అవసరమైతే అరెస్ట్ చేసుకోండి.. మేం మాత్రం కదలేది లేదని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు షేక్ జాకీర్ హుస్సేన్, చల్లా పిచ్చిరెడ్డి, సిద్దాఢపు గాంధీ, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు మునగా పున్నారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుపొగు రాజశేఖర్, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పాలడుగు జానేసు, ఎంపీటీసీ సభ్యులు భాగం వెంకటేశ్వర్లు, తాడికొండ ఆంజనేయరెడ్డి, గూడూరి గోవర్ధన్‌రావు, ప్రగాఢ నాగమ్మ, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాం బయ్య, నాయకులు బత్తుల లింగారెడ్డి, జంగా సైదులు, షేక్ ఖాదర్‌బాషా, సైసావలి, రామిరెడ్డి, తుమ్మూరి గోవిందరెడ్డి, బోడ్డు నాగేశ్వరరావు  పాల్గొన్నారు.
 
 
 
ధర్నాలో పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు..
 పోలీస్ స్టేషన్ ఎదుట జంగా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాచర్ల, నరసరావుపేట శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి,జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లెబోయిన వెంకట్రామయ్య తదితరులు హాజరయ్యారు.
 
 వైఎస్సార్ సీపీ ధర్నా
 పోలీసుల అదుపులో ఉన్న  వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురవాచారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పీఆర్కే, గోపిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా, నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement