
కామినేనీ.. నోరు అదుపులో పెట్టుకో
కొలుసు పార్థసారథి, కొడాలి నాని
కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సూచించారు. చంద్రబాబు మెప్పు కోసం తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇష్టానుసారం విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సమాయత్తం కోసం సారథి, కొడాలి నాని బుధవారం కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై నోరు పారేసుకుంటే మంత్రి కామినేని కంటే వయసులో చిన్నవాడినైన తాను కైకలూరు నడిరోడ్డుపై నిలబడి ఆయన్ను తిడతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కామినేని మళ్లీ సీటు తెచ్చుకుంటారని, అయితే కైకలూరులో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టంచేశారు.
కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అనారోగ్యంతో మరణించే శిశువులను చూశామని, ఈ రాష్ట్రంలో మాత్రం చీమలు, ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఎక్కడైన ఉందా? అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి కామినేని పాలన తీరే కారణమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను మాట్లాడుతూ గత ఎన్నికల్లో గాలివాటున కామినేని గెలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ స్థానిక ప్రజలు తాగునీటి కోసం అల్లాడటానికి మంత్రి కామినేని శ్రీనివాస్ కారణమని విమర్శించారు. ముదినేపల్లిలో ఆయన అనుచరుల చేపల చెరువులకు నీటిని మళ్లించడం వల్లే తాగునీటి ఇబ్బందులు దాపురించాయని వివరించారు. అధికారంతో ప్రశ్నించే వారిని అణగదొక్కలని చూస్తే కార్యకర్తలందరం ఒక్కటై పోరాడతామని హెచ్చరించారు.