దళితులపై దాడికి కొవ్వొత్తులతో నిరసన
దళితులపై దాడికి కొవ్వొత్తులతో నిరసన
Published Wed, Aug 10 2016 11:31 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
విజయవాడ(పూర్ణానందంపేట):
దళితులపై దాడులకు పాల్పడుతున్న భజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌లను వెంటనే నిషేధించాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు కాలే పుల్లారావు డిమాండ్ చేశారు. అమలాపురంలోని జానకీపేటలో దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో బుధవారం పెజ్జోనిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం జరిగింది. పుల్లారావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. పలు రాష్ట్రాల్లో దళితులపై మతోన్మాదశక్తులు అమానుషంగా దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ అమలాపురంలో దళితులపై దాడులకు పాల్పడిన వారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం అన్యాయమన్నారు. దాడులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులపై దాడులకు పాల్పడుతున్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామా దేవరాజు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు పొలిమెట్ల శరత్‌బాబు, పైడిమాల సాల్మాన్‌రాజు, సంగీత్‌బాబు, జంగం కోటేశ్వరరావు, బత్తుల పాండు, సుజాతదాసు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement