
నోట్ల రద్దుపై కేంద్రాన్ని నిలదీయాలి
ధర్నాలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్
హిందూపురం అర్బన్ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ అనాలోచిత నిర్ణయంతో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం హిందూపురం పట్టణంలోని ఎస్‌బీఐ వద్ద పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున అధ్యక్షతన ‘సామాన్యుడే సమిధ’ అనే పేరుతో ధర్నా నిర్వహించారు. నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు ఎంతగా నలిగిపోతున్నారో గద్దెనెక్కిన నాయకులకు అర్థం కావడం లేదన్నారు.
ఏమాత్రం ఆలోచించకుండా ప్రధాని పెద్ద నోట్లు రద్దుచేసి ప్రజలను కష్టాలోకి నెట్టేశారని ఆవేదన చెందారు. రూ.వెయ్యి నోటును 1999లో బీజేపీ ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. తాజాగా రూ.2 వేలు నోటు కూడా బీజేపీ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. దీంతో గుజరాతీలు అన్ని రాష్ట్రాల్లో చిల్లర నోట్ల కమీషన్ వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నల్లధనం వెలికి తీయాలంటే విదేశాల్లో దాచుకున్న డబ్బును రప్పించాలని సూచించారు. ముందస్తుగా అంతా సర్దుకుని ప్రజలను రోడ్డుకు లాగడం ఎంతవరకు న్యాయమని అధికార పార్టీలపై మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ, బీ, బ్లాక్ కన్వీనర్లు ఇర్షాద్, మల్లికార్జున, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పనులు మానేసి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. అనంతరం నాయకులు, ప్రజలు తరలివెళ్లి ఎస్‌బీఐ మేనేజరుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు శ్రీరాంరెడ్డి, జిల్లా కార్యదర్శి ఫజుల్ రెహెమాన్, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్ కౌన్సిలర్లు జబీవుల్లా, రజనీ, నాయకులు రియాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.