వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యం
ఎల్‌బీపురం(తవణంపల్లె): తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని, రానున్న ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తవణంపల్లె మండలంలోని ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఎల్.సురేష్‌బాబురెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేగాక వారికి మంత్రి పదవులు అప్పగించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం దారుణ మన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గాంధీబాబు, పార్టీ తవణంపల్లె, ఐరాల మండలాధ్యక్షులు సురేష్‌బాబురెడ్డి, బుజ్జిరెడ్డి పాల్గొన్నారు.