సత్వర న్యాయం కోసం ఓ రైతు పాదయాత్ర
నెల్లూరు నుంచి ఒంగోలుకు చేరిన పాదయాత్ర
తెలుగు రాష్ట్రాల సీఎంలకు విన్నవించేందుకు కంకణం
ఒంగోలు టౌన్ : ‘ఉప్పు దొరకని ఊరున్నా ఫర్వాలేదు. న్యాయం దొరకని ఊరంటూ ఉండకూడదని’ ఓ యువ రైతు పాదయాత్ర ప్రారంభించారు. ‘ఈ నడక చట్టాన్ని తెచ్చేవరకు’ అనే ఫ్లెక్సీని భుజంపై మోసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన ఎన్.శ్రీహరి అనే యువ రైతు సత్వర న్యాయం కోసం ఐదు రోజుల క్రితం తన గ్రామం నుంచి బయలుదేరాడు. ముందుగా విజయవాడ చేరుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవాలని, ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసి సత్వర న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవాలని నిర్ణయించాడు. అందులో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు.
గ్రామాల నుంచి నగరాల వరకు రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒకవిధంగా గొడవలు జరగడం, అవి ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, భూముల గొడవలు.. ఇలా సంఘటనలు ఏమైనా సత్వర న్యాయం లేకపోవడం వల్ల అనర్థాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిన్న గొడవ జరిగినా, పెద్ద గొడవ జరిగినా రచ్చబండకు తీసుకువచ్చి సత్వర న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎలాంటి సంఘటన అయినా నెలలు, సంవత్సరాలు పడుతోందన్నారు.
సత్వర న్యాయం జరగాలంటే ప్రతి గ్రామంలో న్యాయం సమీక్షించేవిధంగా ఒక కమిటీ ఉండాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న న్యాయ కమిటీ ఎప్పటికప్పుడు తమ గ్రామాల్లో సమస్యలపై చర్చించి సత్వర న్యాయం అందించేలా చూడాలన్నారు. న్యాయ సమీక్ష చేసే సమయంలో దానిని వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. న్యాయ కమిటీ తప్పు చేస్తే అందులో ఉండేవారిని శిక్షించేందుకు వెనుకాడరాదన్నారు. ఈ న్యాయ కమిటీలో విద్యావంతులను నియమించి నిర్ణీత కాలవ్యవధి ఉండేలా చూడాలన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలిసి ఈ విషయాలను విన్నవించనున్నట్లు శ్రీహరి చెప్పారు.