స్థానిక సంస్థలు నిర్వీర్యం
- బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం
- జెడ్పీ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి
అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లాకు వచ్చే రూ.9 కోట్లు ఏ మాత్రం చాలవన్నారు. జిల్లాలో జెడ్పీ కింద ఐదారు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ నిధులు వాటి నిర్వహణకే సరిపోవన్నారు. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అనంత లాంటి కరువు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన విషయాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.
జెడ్పీకి నిధులు కేటాయించాలని 8 సార్లు తీర్మానాలు చేసినా పట్టించుకోలేదన్నారు. నిధుల లేమితో కనీసం సమావేశంలో తాగునీటి బాటిళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు కేటాయించకుండా జెడ్పీటీసీ, ఎంపీసీటీలను నిర్వీర్యం చేసిందన్నారు. అలాంటప్పుడు ఈ వ్యవస్థలను కొనసాగించడం కన్నా రద్దు చేస్తేనే బాగుంటుందన్నారు. అనంతపురం మండల ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, దీపక్‌రెడ్డి కనీసం గొంతు విప్పడం లేదన్నారు. వారు ఏ ఒక్కచోటైనా మండల సమావేశాల్లో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. సర్పంచుల సంఘం నాయకుడు లోకనాథరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు వినియోగించాల్సిన కేంద్రం నిధులను చంద్రన్నబాటకు ఖర్చు చేస్తూ నీటిఎద్దడి తలెత్తేలా చేస్తున్నారని విమర్శించారు.