సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్టేషన్‌కే పరిమితమైన ఈ పెంపు ఇపుడు రాజమహేంద్రవరంతోపాటు విజయవాడ, నెల్లూరుల్లోనూ అమలులోకి రానున్నది. సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి వీడ్కోలు పలికేందుకు, ఇతర ప్రాంతాల నుంచి తమవద్దకు వచ్చేవారిని తోడ్కొని వెళ్లేందుకు వారి సంబంధీకులు అనేకమంది స్టేషన్‌కు వస్తుంటారు. ప్రయాణికేతర ప్రజల రద్దీని తగ్గించేందుకు, ఆదాయం పెంచుకునేందుకు దాదాపు ప్రతి పెద్ద స్టేషన్‌లో రైల్వే శాఖ ప్లాట్‌ఫాం టిక్కెట్ ధరను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు రూ.10ల నుంచి రూ.20లకు పెంచింది. ఈమేరకు సికింద్రాబాద్‌లోని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ సమయాల్లో రోజుకు 2500 మంది ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కొనుగోలుదారులు ఉంటారని, ఆ టిక్కెట్ ధర పెంపుతో రోజుకు రూ.25 వేల చొప్పున వారం రోజులకు రూ.1,75,000ల ఆదాయం సమకూరనుందని రైల్వే శాఖ అంచనా. కాగా, ఇది తమకు భారమే కాగలదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.