pongal season
-
రాజమహేంద్రవరంలో ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్టేషన్‌కే పరిమితమైన ఈ పెంపు ఇపుడు రాజమహేంద్రవరంతోపాటు విజయవాడ, నెల్లూరుల్లోనూ అమలులోకి రానున్నది. సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి వీడ్కోలు పలికేందుకు, ఇతర ప్రాంతాల నుంచి తమవద్దకు వచ్చేవారిని తోడ్కొని వెళ్లేందుకు వారి సంబంధీకులు అనేకమంది స్టేషన్‌కు వస్తుంటారు. ప్రయాణికేతర ప్రజల రద్దీని తగ్గించేందుకు, ఆదాయం పెంచుకునేందుకు దాదాపు ప్రతి పెద్ద స్టేషన్లో రైల్వే శాఖ ప్లాట్‌ఫాం టిక్కెట్ ధరను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు రూ.10ల నుంచి రూ.20లకు పెంచింది. ఈమేరకు సికింద్రాబాద్‌లోని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ సమయాల్లో రోజుకు 2500 మంది ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కొనుగోలుదారులు ఉంటారని, ఆ టిక్కెట్ ధర పెంపుతో రోజుకు రూ.25 వేల చొప్పున వారం రోజులకు రూ.1,75,000ల ఆదాయం సమకూరనుందని రైల్వే శాఖ అంచనా. కాగా, ఇది తమకు భారమే కాగలదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పైలట్లూ.. గాలిపటాలతో జాగ్రత్త!
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గాలిపటాల జోరు బాగా కనిపిస్తుంది. దాదాపుగా భారతదేశంలో అన్నిచోట్లా వీటిని బాగానే ఎగరేస్తుంటారు. ఈ నేపథ్యంలో విమానాలు నడిపే పైలట్లు కాస్తంత చూసుకుని వెళ్లాలనం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ప్రధానంగా గుజరాత్లో వీటి సందడి మరీ ఎక్కువగా ఉంటుందని, ఔత్సాహికులు చాలా పెద్దపెద్ద మాంజాలను ఉపయోగించి తమ గాలిపటాలను విమానాల కంటే కూడా ఎత్తులో ఎగరేస్తారని, అందువల్ల అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే పైలట్లు అప్రమత్తంగా ఉండాలని ఏఏఐ తెలిపింది. ముఖ్యంగా రాత్రిపూట ఈ గాలిపటాలు కనిపించే అవకాశం తక్కువని, పగటి పూట మామూలువే ఎగరేస్తున్నా, రాత్రిళ్లు మాత్రం లైట్లు అమర్చిన గాలిపటాలు ఎగరేస్తున్నారని, అందువల్ల విమానాలు టేకాఫ్ తీసుకునే సమయంలోను, ల్యాండింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఏఏఐ తెలిపింది. కేవలం ఒక్క అహ్మదాబాద్ మాత్రమే కాదని, ఇండోర్, వడోదర, సూరత్, ఉదయ్‌పూర్, ముంబై లాంటి నగరాల్లో కూడా గాలిపటాలతో తాము ఈ సీజన్ మొత్తం కాస్త జాగ్రత్తగానే ఉండక తప్పదని పైలట్లు అంటున్నారు. గుజరాత్లో ఉత్తర్యాన్ పేరుతో సంక్రాంతిని జరుపుకొంటారు. హైదరాబాద్‌లాగే అక్కడ కూడా భారీగా గాలిపటాల ఉత్సవాలు చేస్తుంటారు. అందుకే పైలట్లను ఏఏఐ హెచ్చరించింది. -
పండుగకు ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో ప్రకటించారు. హైదరాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-తిరుపతి, హైదరాబాద్-తిరుపతిలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. ఈనెల 11న రైలు నెం.07449 సికింద్రాబాద్-కాకినాడ పోర్టు(వయా భీమవరం), హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్(02764, 02763) సర్వీసులు ఈనెల 13,14 తేదీల్లోను, హైదరాబాద్-విశాఖ-హైదరాబాద్(07148, 07147) సర్వీసులు ఈనెల 15,16 తేదీల్లో, కాకినాడ పోర్టు-తిరుపతి-కాకినాడ పోర్టులకు(07941, 07942) సర్వీసులను ఈనెల 12,13 తేదీల్లో నడుపుతారు. మధురై-విజయవాడల మధ్య కూడా రెండు రైళ్లను నడుపతున్నట్లు ఆయన తెలిపారు. మధురై-విజయవాడ(06069) రైలును ఈనెల 14న, విజయవాడ-మధురై రైలును 16న నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. -
పండుగవేళ.. రాష్ట్రమంతా కరువు!
తమ రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ఆయన ప్రకటించారు. దక్షిణాది వారికి, అందునా తమిళులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి సమయంలో ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన నీటి కొరత కారణంగా.. రైతులకు భూమిపన్నును మినహాయిస్తున్నట్లు చెప్పడంతో పాటు పలు రాయితీలు కూడా ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 160 కోట్లు, పల్లెల్లో సాగునీటి కోసం రూ. 350 కోట్లను విడుదల చేశారు. ప్రధానంగా కర్ణాటకతో కావేరీ జలాల వివాదం కారణంగా తమిళనాడుకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. తాగు, సాగునీటి కోసం తమిళులు అల్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా కూడా ప్రకటించడంతో కావేరీ జలాల కోసం మరింతగా కర్ణాటకను పట్టుబట్టే అవకాశం ఏర్పడింది. తమిళనాడుకు ఇప్పటికే కర్ణాటక నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల కావేరీ జలాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ఈ నీటిని వదులుతోంది. -
మా ఆట కోసం ఆర్డినెన్స్ ఇవ్వండి!
సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో జల్లికట్టు ఆటకు సుప్రీంకోర్టులో బ్రేకులు పడటంతో తమిళ పార్టీలన్నీ ఒక్కసారిగా నీరసపడ్డాయి. ముఖ్యమంత్రి జయలలిత నుంచి ఎండీఎంకే నేత వైగో వరకు ప్రతి ఒక్కరూ దీనిపై రకరకాలుగా స్పందించారు. తమ ఆటను ఎలాగైనా ఆడించుకోవాలని మంచి పట్టుదలతో ఉన్న తమిళనాడు సీఎం జయలలిత.. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జల్లికట్టును అనుమతించేందుకు ఒక ఆర్డినెన్సు ఇప్పించాలని ఆమె అందులో కోరారు. సాధారణంగా అయితే.. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకే ఆర్డినెన్సులు జారీ చేస్తారు. కానీ త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తమ ఆటను ఆడించుకోడానికి వీలుగా ఓ ఆర్డినెన్సు ఇప్పించి పారేయాలని ప్రధానమంత్రిని జయలలిత కోరారు. జల్లికట్టును ఆమోదించేందుకు వీలుగా చట్టాన్ని సవరించినప్పుడు ప్రధానమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించిన నాయకులు కూడా.. ఇప్పుడు మాత్రం ఈ అంశంపై కేంద్ర వైఖరి సరిగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే అధినేత కరుణానిధి కూడా.. జల్లికట్టు ఆడించేందుకు వీలుగా ఆర్డినెన్స్ ఇప్పించాలని ప్రధానమంత్రిని కోరారు. -
ఎల్బీ నగర్ టు పనామా.. బస్సులే బస్సులు!
సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఊళ్లకు వెళ్లేవాళ్లతో సిటీ చౌరస్తాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రాత్రిపూట చూస్తుంటే అక్కడేదో భారీ జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి పనామా గోడౌన్స్ వరకు ఉన్న దారి మొత్తం బస్సులు, వాటి కోసం వేచి చూసే ప్రయాణికులతో నిండిపోతోంది. మంగళవారం నుంచి పలు కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు సోమవారం రాత్రి మూట ముల్లె సర్దుకుని బస్సుల కోసం బయల్దేరారు. నిజానికి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సెలవులు ఎప్పటినుంచి ఇస్తామన్న విషయాన్ని ముందు ప్రకటించకుండా.. చివరి నిమిషంలో విద్యార్థులకు చెప్పడంతో.. వాళ్ల తల్లిదండ్రులు ముందు నుంచి పండగకు ఊళ్లు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే వీలు లేకుండా పోయింది. దాంతో.. అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఊళ్లు వెళ్లేందుకు వచ్చినవాళ్లతో ఎల్బీనగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న పనామా గోడౌన్స్ వరకు నిలిచి ఉంటున్నాయి. అటువైపు వెళ్లాల్సిన సిటీబస్సులు మిగిలిన కొద్దిపాటి రోడ్డులోనే వెళ్లాల్సి రావడంతో.. అక్కడంతా ట్రాఫిక్ జాం అవుతోంది. ఆర్టీసీ కంట్రోలర్లు ఒకవైపు వెళ్లాల్సిన బస్సులన్నింటినీ ఒకో ప్రాంతంలో పార్కింగ్ చేయిస్తూ, ప్రయాణికులకు కూడా వాటి వివరాలు చెబుతూ హడావుడిగా కనిపిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం సరిపడగా బస్సులు లేవని, ఉన్నవి కూడా అన్నీ స్పెషల్ బస్సులే కావడంతో చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు. ప్రైవేటు బస్సుల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏలూరుకు 500-600 వరకు మామూలు బస్సు చార్జి ఉండేది. అలాంటిది ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయల నుంచి టికెట్లు మొదలవుతున్నాయి. అయినా సరే, పెద్దపండగ వస్తోంది కాబట్టి సొంతూళ్లకు వెళ్లాలని అంటున్నారు. -
ఆ నాలుగు రోజులు ఆడేద్దాం
''హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు.. ఇవన్నీ ఎప్పుడూ మామూలే.. పండగ ముందు ఆ మాత్రం హడావుడి ఉంటుంది.. ఈసారి పండగ మూడురోజులతో పాటు ముక్కనుమ ఆదివారం వచ్చింది.. ఆ నాలుగు రోజులు కోడి పందేలు వేసుకోండి. ఏమైనా జరిగితే మేం చూసుకుంటాం..'' తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి కోడిపందేల నిర్వాహకులకు ఇచ్చిన భరోసా ఇది. ఆ నేత ఒక్కరే కాదు డెల్టా ప్రాంతంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పందేలరాయుళ్లకు వత్తాసు పలుకుతూ బరులు వేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు అయితే బహిరంగంగానే కోడిపందేలు నిర్వహిస్తామని, అవసరమైతే జీవో కూడా తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోడిపందేల నిర్వహణకు జీవో తెప్పించడమేమిటనేది ఎవరికీ అర్థం కాకపోయినా మాగంటి బాబు తమకు అండగా ఉన్నారనేది పందేలరాయుళ్లకు బాగానే అర్థమైంది. ఇక ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అండ ఎటూ ఉంటుంది. డెల్టా ప్రాంతంలో సెంటిమెంట్, గ్రామాల అభివృద్ధి పేరుతో ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ పందేలరాయుళ్లకు ఎప్పుడూ వత్తాసు పలుకుతారు. మిగిలిన టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోయినా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు అవసరమైతే నానాయాగీ చేయగలరనేదానికి గత ఏడాది జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు చేసిన హల్చల్ తార్కాణం. సరిగ్గా ఆ ధైర్యంతోనే పందేల నిర్వాహకులు ఇప్పుడు బరులు సిద్ధం చేసేస్తున్నారు. బరులు రెడీ నిడదవోలులో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించేందుకు రెండు బరులను స్థానిక టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. విజ్జేశ్వరం, ముప్పవరం, తాడిమళ్ళ, సింగవరం, పెండ్యాల గ్రామాల్లో కూడా బరులు తయారు చేస్తున్నారు. పెరవలి మండలంలో ఖండవల్లి గ్రామంలోని కొబ్బరితోటలో భారీ పందెం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీస్థాయి పందేల నిర్వాహకుల్లో చాలామంది ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అనుచరులే ఉన్నారని అంటున్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల్పూరు, తేతలి, మండపాక, దువ్వ గ్రామాలతో పాటు ఇరగవరం, సూరంపూడి, తూర్పువిప్పర్రు, రేలంగి, అత్తిలి ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేస్తున్నారు. ఆడుకోండి... మరి నాకేంటి: టీడీపీ నేత బేరసారాలు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం అర్ధవరం, నిడమర్రు మండలం పత్తేపురం, ఉంగుటూరు మండలం నారాయణపురం, భీమడోలు మండలం గుండుగొలను గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఇటీవలే సమావేశం నిర్వహించారు. పోలీసులతో ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా... మరి నాకేంటి అని ఓ టీడీపీ నేత బేరసారాలు అడినట్టు తెలుస్తోంది. పెద్ద బరులకు ఒక రేటు, చిన్న బరులకు మరో రేటు ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గూడెంలో గుట్టుచప్పుడు కాకుండా.. తాడేపల్లిగూడెంలో గుట్టుచప్పుడు కాకుండా బరులు సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతం, లింగారాయుడుగూడెం, ఆరుగొలను, పెంటపాడు మండలం అల్లంపురం, పెంటపాడు, గూడెం మండలం పెదతాడేపల్లి, కొమ్ముగూడెం ఊళ్లల్లో పందేలు వేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఉండి నియోజకవర్గం అయిభీమవరం, సిద్ధాపురం, దుంపగడప, అప్పారావుపేట, కోళ్లపర్రు, కుప్పనపూడి, జువ్వలపాలెం, ఏలూరుపాడు, బొండాడపేట, చినమిరం, పెదమిరం, కొమటిగుంట గ్రామాల్లో భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, శేరేపాలె, మొగల్తూరు, పేరుపాలెం, మోళ్ళపర్రు, కొత్తోట గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం, దూబచర్ల, పోతవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించటానికి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయగూడెం, యర్నగూడెం, లక్ష్మీపురం, గోపాలపురం మండలంలో గోపాలపురం, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, కరిచర్లగూడెం, కొవ్వూరుపాడు గ్రామాల్లోనూ, ద్వారాకాతిరుమల మండలం మారంపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లోనూ కోడిపందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆ కోళ్లకు జీడిపప్పుతో గుడ్ మార్నింగ్!
సంక్రాంతి వస్తోందంటే చాలు.. కోడిపందాల జోరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పందేల్లో తలపడే కోళ్లకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. పౌరుషం రావడం కోసం రకరకాల ఆహారాలు పెడతారు. మరి అలాంటి కోళ్ల రేట్లు కూడా మామూలుగా ఉండవు కదా. అందుకే విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ యువకుడు ఈ కోళ్ల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. అతడిపేరు నూకనాయుడు. వివిధ జాతులకు చెందిన కోళ్లను పెంచుతూ వాటిని పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతున్నారు. వాటికి జీడిపప్పుతో గుడ్‌మార్నింగ్ చెప్పి.. తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, ఉడకపెట్టిన గుడ్లు, జొన్నలు, రాగులు ఇలా ప్రొటీన్ ఫుడ్డునే ఆహారంగా ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివిన నూకనాయుడు... స్వయం ఉపాధిగా ఈ కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్న ఈ కోళ్లను... సైజును బట్టి 5 వేల నుంచి 50వేల రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. సంక్రాంత్రి దగ్గరపడటం.. కోడిపందాలు జోరందుకోవడంతో నూకనాయుడు కోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ధర ఎంతైనా సరే... ఇలాంటి పుంజులే కావాలంటున్నారు పందెంరాయుళ్లు. -
సంక్రాంతికి 'సాక్షి' ముగ్గుల పోటీ
సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అచ్చమైన తెలుగు పడుచులు రంగవల్లులు తీర్చిదిద్దడంలో మునిగి తేలుతుంటారు. తెల్లటి ముగ్గుల మీద రంగులద్ది, గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని బంతిపూలతో అలంకరిస్తారు. అలాంటి తెలుగింటి అతివలను ప్రోత్సహించేందుకు సాక్షి వెబ్సైట్ sakshi.com ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది. ఉత్తమమైన 5 ముగ్గులకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తాం. తెల్ల కాగితంపై ముగ్గు వేసి, దాన్ని స్కాన్ చేసి మాకు ఈనెల 11వ తేదీ లోగా మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడీ.. sakshidaily@gmail.com సకాలంలో మాకు చేరినవాటిలోంచి మంచి ముగ్గులను ఎంపిక చేసి, బహుమతులు ఇస్తాం. ఇప్పటివరకు పంపిన కొన్ని ఫొటోలను ఇప్పటికే sakshi.comలో గ్యాలరీగా పెట్టాం. అవి చూడాలంటే.. http://www.sakshi.com/photos/events/album-readers-rangoli-for-pongal-season-149 లింకును క్లిక్ చేయండి. నిబంధనలు: 1. మీకు నచ్చిన ఏ అంశంపైనైనా ముగ్గు వేసి పంపవచ్చు. 2. తెల్ల కాగితంపై మాత్రమే ముగ్గులు వేసి స్కాన్ చేసి పంపాలి. 3. ముగ్గు కింద ఆ ముగ్గు వేసిన వారి పూర్తి వివరాలు పేరు, ఊరు, అడ్రస్, సెల్ నెంబర్ ఉండాలి.