మా ఆట కోసం ఆర్డినెన్స్ ఇవ్వండి!
సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో జల్లికట్టు ఆటకు సుప్రీంకోర్టులో బ్రేకులు పడటంతో తమిళ పార్టీలన్నీ ఒక్కసారిగా నీరసపడ్డాయి. ముఖ్యమంత్రి జయలలిత నుంచి ఎండీఎంకే నేత వైగో వరకు ప్రతి ఒక్కరూ దీనిపై రకరకాలుగా స్పందించారు. తమ ఆటను ఎలాగైనా ఆడించుకోవాలని మంచి పట్టుదలతో ఉన్న తమిళనాడు సీఎం జయలలిత.. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జల్లికట్టును అనుమతించేందుకు ఒక ఆర్డినెన్సు ఇప్పించాలని ఆమె అందులో కోరారు.
సాధారణంగా అయితే.. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకే ఆర్డినెన్సులు జారీ చేస్తారు. కానీ త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తమ ఆటను ఆడించుకోడానికి వీలుగా ఓ ఆర్డినెన్సు ఇప్పించి పారేయాలని ప్రధానమంత్రిని జయలలిత కోరారు. జల్లికట్టును ఆమోదించేందుకు వీలుగా చట్టాన్ని సవరించినప్పుడు ప్రధానమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించిన నాయకులు కూడా.. ఇప్పుడు మాత్రం ఈ అంశంపై కేంద్ర వైఖరి సరిగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే అధినేత కరుణానిధి కూడా.. జల్లికట్టు ఆడించేందుకు వీలుగా ఆర్డినెన్స్ ఇప్పించాలని ప్రధానమంత్రిని కోరారు.