‘అమ్మ’ డిశ్చార్జికి సన్నాహాలు
స్వయంగా ఆహారం తీసుకుంటున్న జయలలిత
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జయలలిత అనారోగ్యానికి గురై గత నెల 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దేశ, విదేశీ వైద్యులు అందించిన చికిత్సలతో ఆమె పూర్తిగా కోలుకుని, స్వయంగా ఆహారం తీసుకుంటున్నారు. చికిత్స చేస్తున్న వైద్యులతో సంభాషిస్తున్నారు.
లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ మంగళవారం కూడా సీఎంకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీపావళి పండుగలోగా అమ్మ ఇంటికి చేరుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్న తరుణంలో జయలలిత డిశ్చార్జ్ పై ఈనెల 27లోగా అపోలో ఆస్పత్రి నుంచి ఒక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. కాగాజయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని కోరుతూ తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిర్వహించిన పాలబిందెల ఊరేగింపులో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో 16 మంది సొమ్మసిల్లారు.