తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. అక్కడే మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కర్ణాటకతో నెలకొన్న కావేరీ జలాల వివాదంపై ఆమె ఈ సమావేశం ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా, తన బదులు ఆ సమావేశానికి హాజరు కావాలని ప్రజాపనుల శాఖ మంత్రి పళనిస్వామిని ఆదేశించారు. ఆ సమావేశంలో తాను ఏం చెప్పదలచుకున్నదీ ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. పళనిస్వామి దాన్నే చదవాల్సి ఉంటుంది. గత గురువారం ఆస్పత్రిలో చేరిన జయలలిత డీహైడ్రేషన్, జ్వరానికి చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.
సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల గురించి ఉన్నతాధికారులు, మంత్రులు జయలలితకు వివరించారు. రాబోయే మూడు రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 18వేల క్యూసెక్కుల నీళ్లు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, జయలలిత ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారని, ఆమెకు మరికొంత కాలం విశ్రాంతి అవసరమని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. జయలలితను చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నారంటూ వచ్చినవి కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేసింది. దానివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి వదంతులు రాకుండా ఉండాలంటే ఆస్పత్రి నుంచి జయలలిత వీడియో సందేశం విడుదల చేయాలని పీఎంకే నాయకుడు రామదాస్ కోరారు. గత మూడు రోజుల్లో 107 అమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, ఉచిత అమ్మ వై-ఫై జోన్ల పథకాన్ని కూడా ప్రకటించారని, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయని.. అంటే ఆమె ఆస్పత్రిలో ఉన్నా అన్నింటినీ పరిశీలిస్తూనే ఉన్నారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
ఆస్పత్రిలోనే మంత్రులతో సీఎం సమావేశం
Published Wed, Sep 28 2016 8:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement