ప్రధాని మోదీకి పన్నీరు సెల్వం లేఖ
చెన్నై: తమిళనాట ప్రసిద్ధి చెందిన జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు సంప్రదాయ క్రీడాగా భావించే జల్లికట్టును సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించుకునేందుకు చట్టపరమైన ఇబ్బందులను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా వారం రోజులు పాటు నిర్వహించే జల్లికట్టుకు చాలా విశిష్ఠత ఉందని పన్నీరు సెల్వం తెలిపారు. చట్ట పరమైన ఇబ్బందులను తొలగించాలని, ఇందుకు తమ వంతు కృషి చేయాలని మోదీని కోరారు. గతంలో జల్లికట్టు ప్రదర్శనకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2014లో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. తమిళనాడులో అధికార అన్నా డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా అన్ని పార్టీలు జల్లికట్టు పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరడం గమనార్హం.