మోదీపై స్టాలిన్ తీవ్ర విమర్శలు
చెన్నై: సినిమా నటులను కలవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి సమయం ఉంటుంది కానీ ఎంపీలను కలవడానికి టైమ్ ఉండదా అని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. అన్నాడీఎంకే ఎంపీలకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నిలదీశారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం డీఎంకే తమిళనాడులో రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
‘మోదీ ఎవరెవరినో కలుస్తారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రజనీకాంత్, గౌతమి లాంటి సినిమా నటులకు వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారు. తమిళుల వారసత్వ క్రీడ జల్లికట్టుపై మాట్లాడేందుకు అన్నాడీఎంకే ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు. అన్నాడీఎంకే ఎంపీలు అడిగిన రోజు కాకపోతే మరో రోజైనా అపాయింట్ ఇవ్వాలి కదా’ అని స్టాలిన్ అన్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా జల్లికట్టుపై నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పన్నీరు సెల్వం తక్షణమే ప్రధాని మోదీని కలిసి జల్లికట్టుపై చర్చించాలని డిమాండ్ చేశారు.