జల్లికట్టుపై ముందుకే...: పన్నీర్
న్యూఢిల్లీ/సాక్షి, చెన్నై: కేంద్రం సహకారంతో జల్లికట్టును నిర్వహించేందుకు త్వరలో చర్య లు తీసుకుంటామని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. జల్లికట్టుపై ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడు తూ... తమ ప్రభుత్వం తీసుకునే చర్యలేంటో త్వరలో చూస్తారంటూ ఉత్కంఠకు తెరతీశారు. జల్లికట్టు తమిళ ప్రజల సంప్రదాయక హక్కు, ధైర్యాన్ని ప్రతిబింబించే క్రీడని ప్రధానికి చెప్పినట్లు సెల్వం పేర్కొన్నారు.
తమిళనాడుకు అధికారం ఉంది: అటార్నీ
జల్లికట్టును సంప్రదాయ క్రీడగా పరిగణిస్తూ చట్టం చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉందని కేంద్ర అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టతనిచ్చారు. అయితే జంతువుల్ని గాయపర్చడం, హింసించడం చేయకూడదని చెప్పారు. క్రీడలకు సంబంధించినంత వర కూ... ప్రత్యేక అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందన్నారు.
నేడు బంద్: జల్లికట్టుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై మెరీనాబీచ్‌లో ఆందోళనలు గురువారం మూడో రోజుకు చేరాయి. విద్యార్థులకు మద్దతుగా వేలాది మంది తరలివస్తున్నారు. మెరీనా తీరం రణరంగాన్ని తలపిస్తోంది. షూటింగులను రద్దు చేసి సినీ కళాకారులు ఆందోళనకు మద్దతు పలికారు. శుక్రవారం రాష్ట్రబంద్ చేపట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనలో పాల్గొనాలని ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. తమిళ సినిమా రంగం నేడు నిరాహారదీక్ష చేపట్టనుంది. దర్శకుడు లారెన్స్ జల్లికట్టు నిర్వహణకు రూ.కోటి విరాళం ప్రకటించారు.