ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా?
జల్లికట్టుపై కమల్ హాసన్
సాక్షి, ప్రతినిధి, చెన్నై: జల్లికట్టు కోసం పోరాడుతున్న తమిళనాడు విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగాలను ప్రముఖు నటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘విద్యార్థులనే కాకుండా మహిళలను, బాలలను కూడా బలవంతంగా తరలించారు. ఎంజీఆర్ (దివంగత సీఎం) బతికుంటే ఇలా జరిగేదా? ఆయన విద్యార్థులను కలసి మాట్లాడేవారు. సీఎం పన్నీర్ సెల్వం కూడా అలా చేసి ఉండాల్సింది. జల్లికట్టుకు అడ్డంకుల్లేకుండా శాశ్వత చట్టం చేయాలని 20 ఏళ్లుగా కోరుతున్నాం. ఈ ఆటను నిషేధించినవారు పల్లెలపై దాడి చేసే మదపుటేనుగులను ఎందుకు నిషేధించడం లేదు?’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు.
సాధారణ స్థితికి: జల్లికట్టు మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో సోమవారం అట్టుడికిన తమిళనాడులో మంగళవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు పలు ప్రాంతాల్లో అదనపు పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. జల్లికట్టు కోసం శాశ్వత చట్టం తేవాలని వందమంది నిరసనకారులు బీచ్‌లో ధర్నా చేశారు. అరెస్ట్ చేసిన తమ వందమంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టే షన్ ను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో జల్లికట్టులో ఓ ఎద్దు పొడవడంతో ఒక పోలీసు చనిపోయాడు. జల్లికట్టును అనుమతిస్తూ 2016లో జారీచేసిన నోటిఫికేషన్ ను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.